SPOT VOICE
Newspaper Banner
Date : 21 October 2026, 12:35 pm Posted By : SPOT VOICE MEDIA

పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి

శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలి

జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

స్పాట్ వాయిస్, రఘునాథపల్లి : ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రఘునాథపల్లి పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి నార్త్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. తొలుత అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. అమరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ పేర్కొన్నారు. వారి స్ఫూర్తితో మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని పోలీసులకు సూచించారు. మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ పోలీసులు తక్కువ సమయంలోనే నేరాలను ఛేదిస్తున్నారని అభినందించారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐలు వేణు, సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్, దేవేందర్, భరత్ సుమన్, స్థానిక ఎస్‌ఐ మోదుగు భరత్‌తో పాటు వెస్ట్ జోన్ పరిధిలోని పోలీసు సిబ్బంది పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు.