ఎండిపోతున్న వరి పొలాలు.
స్పాట్ వాయిస్ మల్హర్:మండలంలోని బొగ్గుల వాగు ప్రాజెక్టు కాలువ నీరు చివరి ఆయకట్టు వరకు అందకపోవడంతో చేతికొచ్చిన పంటలు కళ్ళముందే ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బొగ్గుల వాగు ప్రాజెక్టు నుండి వచ్చే కాలువలు ఎక్కడికక్కడ తుంగ, నాచుతో నిండిపోయి, అక్కడక్కడ గండ్లు పడి సాగునీరు చివరి వరకు పారడం కష్టంగా మారింది. దీంతో చివరి ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎడ్లపల్లి కొయ్యూరు ప్రధాన రహదారి పక్కన
వల్లెంకుంట గ్రామానికి చెందిన రైతులు గడిపెల్లి సమ్మరాజు, కొండ్ర సత్తయ్య, గడ్డం రమేష్, బోడ రామచంద్రం, పసుల పోచయ్య, గడ్డం రాజయ్య తదితరులకు చెందిన ఒక్కొక్కరికి 1-2 ఎకరాల చొప్పున ఉన్న వరి పంటలు చేతికి అందే ముందే ఎండిపోయి పొలాల్లో బీటలు వారాయి. దీంతో ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.ఈ విషయంపై ఇరిగేషన్ శాఖ ఏఈని సంప్రదించగా.. “రైతులే సొంత ఖర్చులతో కాలువలను రిపేర్ చేసుకొని సాగునీరు తీసుకెళ్లండి” అంటూ సమాధానం ఇచ్చారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఫండింగ్ లేదని, తాము ఏమీ చేయలేమని చేతులెత్తేశారని రైతులు ఆరోపిస్తున్నారు.చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.