SPOT VOICE
Newspaper Banner
Date : 19 October 2026, 6:59 pm Posted By : SPOT VOICE MEDIA

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. సర్కారుకు సెగ..!

 
ఎండుతున్న చెరువులు.. కరెంటు కోతలతో రైతుల గోస
పొట్ట దశలో పంటలు..
కాళేశ్వరం నీటిని ఎత్తిపోయకపోవడంపై ప్రశ్నలు
భట్టి నేతృత్వంలో సబ్‌కమిటీ.. అన్నదాతకు ఊరట ఎప్పుడో?

స్పాట్‌ వాయిస్‌, ప్రధానప్రతినిధి: ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు ఎడారులుగా మారుతున్న చెరువులు.. ఇంకోవైపు వ్యవసాయ విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలపై రైతుల ఆందోళన. పొట్ట దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్న వేళ రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌కమిటీని ఏర్పాటు చేసినా.. క్షేత్రస్థాయిలో రైతులకు తక్షణ ఉపశమనం ఎప్పుడు లభిస్తుందన్నదే ప్రశ్నగా మిగిలింది.

కాళేశ్వరం నీరు ఏమైంది..?
గోదావరి జలాలను ఎత్తిపోసి సాగు అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రాజెక్టుల నీటిని వినియోగంలోకి తీసుకొచ్చి చెరువులు, కాల్వలకు నీరందిస్తే పంటలను కాపాడుకునే అవకాశం ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వర్షాభావంతో చెరువులు వెలవెలబోతుండటం, భూగర్భ జలాలు తగ్గుతుండటంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. అందుబాటులో ఉన్న నీటి వనరులను పూర్తిస్థాయిలో వినియోగించి పంటలకు భరోసా కల్పించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మోటార్లు ఆన్ చేస్తే కాస్తయిన ఊరట లభించేదనే చర్చ సాగుతోంది. ఇన్నాళ్లు కాంగ్రెస్ కలిసివచ్చిన అంశం.. ఇప్పుడు ప్రభుత్వానికి మైనస్ గా మారే ఛాన్స్ ఉందనే విశ్లేషకులు అంటున్నారు.

కరెంటు కోతలు.. కంటిమీద కునుకు లేదు
పంటలకు కీలకమైన సమయంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నీరు అందక పంటలు ఎండిపోతాయన్న భయంతో రైతులు పొలాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో జలవిద్యుత్‌ ఉత్పత్తి తగ్గడం, విద్యుత్‌ డిమాండ్‌ పెరగడం సరఫరాపై ఒత్తిడిని పెంచుతున్నాయి. వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ అందించి, పంటలు చేతికొచ్చే వరకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
సబ్‌కమిటీతో సాంత్వన దక్కేనా..?
ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులపై సమీక్షించేందుకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి సభ్యులుగా ఉన్నారు. సాగు, తాగునీరు, విద్యుత్‌, పశుగ్రాసం, రిజర్వాయర్ల నిర్వహణపై ఈ కమిటీ సమీక్షించి చర్యలను సూచించనుంది. అయితే సమీక్షలు, సమావేశాలకే పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో నీటి లభ్యతను పెంచడం, విద్యుత్‌ సమస్యలను పరిష్కరించడం, ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తక్షణ కార్యాచరణ అమలు చేయడమే ఇప్పుడు కీలకం కానుంది.
అన్నదాత కన్నెర్ర చేస్తే..?
వర్షాభావంతో ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయే పరిస్థితిలో ఉన్న రైతులకు మరో దెబ్బ తగిలితే ఆగ్రహం పెరిగే ప్రమాదం ఉంది. పంట పెట్టుబడులు, కూలీ ఖర్చులు, విద్యుత్‌, నీటి కోసం పడుతున్న ప్రయాసల మధ్య పంటలు చేతికందకపోతే రైతు కుటుంబాలపై భారం మరింత పెరుగుతుంది. అందుకే కాళేశ్వరం నీటి వినియోగంపై స్పష్టత, వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌, చెరువులు–కాల్వలకు నీటి సరఫరా, నష్టపోయే రైతులకు భరోసా వంటి అంశాలపై ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎల్‌నినో సవాల్‌ను ఎదుర్కొనేందుకు సబ్‌కమిటీ ఏం చేస్తుంది..? రైతుల నీటి గోస తీరుస్తుందా..? లేక రానున్న రోజుల్లో కష్టాలు మరింత పెరుగుతాయా..? అన్నది వేచి చూడాలి.