SPOT VOICE
Newspaper Banner
Date : 25 October 2026, 5:17 pm Posted By : SPOT VOICE MEDIA

రాకేష్ రెడ్డి–రంజిత్ రెడ్డి మధ్య కోల్డ్‌వార్‌..!

 

స్పాట్ వాయిస్, హన్మకొండ :హనుమకొండ జిల్లా బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. వరంగల్ పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం వేదికగా రాకేష్ రెడ్డి, దుగ్గింపూడి రంజిత్ రెడ్డి మధ్య కోల్డ్‌వార్‌ కొనసాగుతోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ హాజరైన సమావేశంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. రాకేష్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో రంజిత్ రెడ్డి వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు సమావేశం నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. రంజిత్ రెడ్డి వెంట వందలాది మంది యువకులు వెళ్లడంతో సభా ప్రాంగణం ఒక్కసారిగా ఖాళీ అయినట్లు సమాచారం. ఈ పరిణామం పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది.

ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాల్లో నేతలంతా సమన్వయంతో ముందుకు సాగాల్సిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరు నేతల మధ్య విభేదాలే వాకౌట్‌కు కారణమా? లేక ఇతర అంశాలపై అసంతృప్తి ఉందా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఎన్నికల వేళ తెరపైకి వచ్చిన ఈ పరిణామాలు పార్టీ అంతర్గత రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.