SPOT VOICE
Newspaper Banner
Date : 15 October 2026, 6:31 pm Posted By : SPOT VOICE MEDIA

పెద్ది తర్వాత.. ఎవరు..?

పెద్ది తర్వాత.. ఎవరు..?
నర్సంపేటపై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌..!
సుదర్శన్ రెడ్డి కుటుంబం.. రాజకీయ పాత్రపై చర్చ
16న కేటీఆర్‌తో పార్టీ శ్రేణుల భేటీ..?
స్వప్నతో సమన్వయంగా తాత్కాలిక నాయకత్వం
హరీశ్‌రావుతోనూ పెద్ది కుటుంబం భేటీ
కీలక సంకేతాలపై గులాబీ గూటిలో ఉత్కంఠ
తాత్కాలిక సారథి ఎంపికపై ఆసక్తి
స్పాట్ వాయిస్, ఓరుగల్లు : నర్సంపేట బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై అధిష్టానం స్పష్టతకు వస్తోందా? దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి అండగా నిలుస్తూ.. నియోజకవర్గ పార్టీ బాధ్యతలను తాత్కాలికంగా మరొక కీలక నేతకు అప్పగించే దిశగా అడుగులు పడుతున్నాయా..? పెద్ది సతీమణి స్వప్న సుదర్శన్‌రెడ్డితో సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించేలా రూట్‌మ్యాప్‌ సిద్ధమవుతోందా? ఈ ప్రశ్నలు ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుక్రవారం నర్సంపేట పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు వెలువడతాయన్న ఆసక్తి నెలకొంది. పెద్ది మరణంతో ఏర్పడిన నాయకత్వ లోటును భర్తీ చేయడం, కేడర్‌ను చెక్కుచెదరకుండా కాపాడుకోవడం, ఆయన కుటుంబానికి రాజకీయంగా ప్రాధాన్యం కొనసాగించడం.. ఈ మూడు అంశాల చుట్టూ పార్టీ వ్యూహం సాగుతున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కేసీఆర్‌కు నమ్మిన బంటుగా.. పెద్ది
గులాబీ అధినేత కేసీఆర్‌ తర్వాత పార్టీలో అంతటి విశ్వాసాన్ని సంపాదించిన నేతల్లో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసిన నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ‘పెద్ద సారు ఆదేశిస్తే.. పెద్ది ఆచరిస్తారు’ అనే స్థాయిలో పార్టీ అధినేతతో ఆయనకు అనుబంధం ఉండేది. నర్సంపేట నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ.. కేసీఆర్‌ ఆశీస్సులతో ఐదేళ్లలోనే ఎన్నో అభివృద్ధి ప్రాజెక్టులను తీసుకొచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు. నియోజకవర్గ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన అంతిమయాత్రకు వెల్లువెత్తిన ప్రజాభిమానమే దీనికి నిదర్శనం.

బీఆర్ ఎస్ పార్టీకి తీరని లోటు..
వరంగల్‌ జిల్లాతోపాటు నర్సంపేట నియోజకవర్గంపై గట్టి పట్టున్న పెద్ది అకాల మరణం పార్టీకి తీరని లోటుగా మారింది. ఆయన లేని లోటు కేడర్‌లోనూ, నాయకత్వంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గ పార్టీ సమన్వయ బాధ్యతలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నిర్వహిస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయి నాయకత్వంపై స్పష్టత లేకపోవడంతో శ్రేణుల్లో సందిగ్ధత కొనసాగుతోంది. పెద్ది కుటుంబాన్ని అభిమానించే కార్యకర్తలు, ఆయన వెంట నడిచిన నాయకులు బీఆర్‌ఎస్‌తోనే కొనసాగుతున్నప్పటికీ.. నియోజకవర్గ రాజకీయాలను ముందుకు నడిపించే బాధ్యత ఎవరికి అప్పగిస్తారన్నది కీలకంగా మారింది.

నాయకత్వ పోటీపై అధిష్టానం దృష్టి?
పెద్ది మరణంతో ఏర్పడిన ఖాళీని అవకాశంగా తీసుకొని కొందరు నేతలు నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తమ రాజకీయ వారసులకు భవిష్యత్తులో ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో కొందరు నేతలు ఇతర రాజకీయ సంబంధాలను ఉపయోగించుకుంటూ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఒక అధికారపక్ష నేతకు సన్నిహితంగా ఉన్న కుటుంబంతో కలిసి ఇద్దరు నేతలు గులాబీ పార్టీలో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై అధిష్టానం దృష్టి సారించినట్లు బీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పెద్ది సుదర్శన్‌రెడ్డి బతికున్న సమయంలోనూ ఆయనకు వ్యతిరేకంగా రాజకీయాలు నడిపిన కొందరు నేతలు ఇప్పుడు నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేసి కేడర్‌లో గందరగోళం లేకుండా చూడాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నర్సంపేటకు సంబంధించి అధిష్టానం ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరికి బాధ్యతలు అప్పగించాలి? పెద్ది కుటుంబానికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలి? కేడర్‌ను ఏ నాయకుడి ఆధ్వర్యంలో సమన్వయం చేయాలి? అనే అంశాలపై అంతర్గతంగా చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేటీఆర్‌ నర్సంపేట శ్రేణులతో నిర్వహించనున్న సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

ధైర్యమిచ్చారా..?
పెద్ది సుదర్శన్‌రెడ్డి రెండో నెల మాసికం పూర్తయిన తర్వాత ఆయన కుటుంబంపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించినట్లు బీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల పెద్ది సతీమణి స్వప్న సుదర్శన్‌రెడ్డి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను, సీనియర్‌ నేత హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్‌తో జరిగిన వ్యక్తిగత సమావేశంలో స్వప్నకు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై భరోసా కల్పించడంతోపాటు, ఆమె భుజం తట్టి ధైర్యం చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం. హరీశ్‌రావుతో జరిగిన భేటీ కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఉద్యమ సహచరుడైన పెద్ది కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చి, భవిష్యత్తులో అనుసరించాల్సిన కార్యాచరణపై స్వప్నకు మార్గనిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా కేటీఆర్‌, హరీశ్‌రావు ఇద్దరూ పెద్ది కుటుంబానికి భరోసా కల్పించే దిశగా వ్యవహరిస్తున్నారనే సంకేతాలు వెలువడుతున్నట్లు నాయకులు భావిస్తున్నారు. పెద్ది కుటుంబాన్ని పక్కనపెట్టకుండా.. అదే సమయంలో నియోజకవర్గ పార్టీ వ్యవహారాలు నిలిచిపోకుండా చూడాలన్నది అధిష్టానం ముందున్న ప్రధాన సవాలుగా కనిపిస్తోంది. స్వప్న సుదర్శన్‌రెడ్డి విషాదం నుంచి కోలుకొని పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయి రాజకీయాల్లో చురుకుగా పాల్గొనే వరకు నియోజకవర్గ బాధ్యతలను తాత్కాలికంగా మరో కీలక నేతకు అప్పగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఎర్రబెల్లి, పోచంపల్లి, ముత్తిరెడ్డి.. ఎవరికి బాధ్యతలు?
నర్సంపేట నియోజకవర్గానికి తాత్కాలిక ఇన్‌చార్జిగా ఎవరిని నియమిస్తారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ప్రస్తుతం సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరిలో ఒకరికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తుది నిర్ణయంపై పార్టీ అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నియోజకవర్గ బాధ్యతలు చేపట్టే నాయకుడు ఒంటరిగా నిర్ణయాలు తీసుకునే విధానం కాకుండా.. పెద్ది స్వప్న సుదర్శన్‌రెడ్డితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నది ప్రతిపాదిత కార్యాచరణలో కీలక అంశంగా చెబుతున్నారు. పెద్ది తన రాజకీయ శ్రమతో నిర్మించిన కేడర్‌ను కాపాడుకోవడం, నాయకుల మధ్య సమన్వయం పెంచడం, రాబోయే ఎన్నికల వరకు పార్టీ యంత్రాంగాన్ని క్రియాశీలంగా ఉంచడం తాత్కాలిక ఇన్‌చార్జి ముందున్న ప్రధాన బాధ్యతలుగా భావిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ నిర్మాణం బలహీనపడకుండా చూడాలని, పెద్ది హయాంలో ఏర్పడిన కార్యకర్తల నెట్‌వర్క్‌ను కొనసాగించాలని కేటీఆర్‌ సంబంధిత నాయకుడికి దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాల్లో సమాచారం. ఈ నెల 16న జరిగే సమావేశంలో కేడర్‌కు ఎలాంటి సందేశం ఇస్తారు? తాత్కాలిక నాయకత్వంపై స్పష్టత వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

స్వప్న రాజకీయ ప్రస్థానానికి ప్రాధాన్యం
పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి స్వప్న సుదర్శన్‌రెడ్డికి కూడా ఉద్యమ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమ నేతగా, తెలంగాణ ఉద్యమంలో రాయినిగూడెం కేంద్రంగా వ్యూహాత్మకంగా పనిచేసిన ఉద్యమకారిణిగా ఆమెకు గుర్తింపు ఉంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నల్లబెల్లి జెడ్పీటీసీగా, వరంగల్‌ జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు. అనంతరం నర్సంపేట రాజకీయాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో స్వప్న సుదర్శన్‌రెడ్డి రాజకీయ పాత్రను కొనసాగించేలా పార్టీ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆమె అనుభవాన్ని పక్కనపెట్టకుండా, నియోజకవర్గ నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించే విధంగా తాత్కాలిక ఇన్‌చార్జి వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా పెద్ది కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యం కొనసాగడంతోపాటు, నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలకు ఆటంకం లేకుండా చూడవచ్చని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.

రాబోయే ఎన్నికలే అసలు పరీక్ష
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నర్సంపేటలో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం బీఆర్‌ఎస్‌ అధిష్టానానికి ఉంది. ఈ ఎన్నికల సన్నాహాల్లో తాత్కాలిక ఇన్‌చార్జి, స్వప్న సుదర్శన్‌రెడ్డి పరస్పర సమన్వయంతో పనిచేసేలా కేడర్‌కు స్పష్టమైన సందేశం ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా కేటీఆర్‌ రూపొందిస్తున్న కార్యాచరణలో పెద్ది కుటుంబానికి ప్రాధాన్యం, కేడర్‌ ఐక్యత, నాయకత్వ సమన్వయం ప్రధాన అంశాలుగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, తాత్కాలిక ఇన్‌చార్జి నియామకం, స్వప్నకు భవిష్యత్తులో అప్పగించే బాధ్యతలు, అంతర్గత ఆరోపణలపై అధిష్ఠానం వైఖరి అధికారికంగా వెల్లడైతేనే ఈ చర్చలకు స్పష్టత రానుంది.