వారి బాధలు దగ్గరుండి చూశా..
పట్టభదుల సమస్యను నా సమస్యగా భావించి ప్రశ్నించిన
ఓడిపోయానని బాధపడలే..
జన సభలో కొట్లాడాలని ఫిక్స్ అయ్యా..
రెండున్నరేళ్లుగా కాళ్లకు చక్రలు కట్టుకొని తిరుగుతున్న
కోచింగ్ భారం తగ్గించేందుకు ఈ-క్లాసెస్ యాప్..
మహిళలకు ఉపాధి కోసం శిఖర స్కిల్ సెంటర్
కేసీఆర్ ప్రోత్సాహం మరువలేనిది..
కేటీఆర్ జన్ జీ తరానికి సరిపోయే లీడర్
రెండున్నరేళ్లుగా పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి.. మూడు ఉమ్మడి జిల్లాల్లో కాలుకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నారు. నిరుద్యోగం ఒక సామాజిక సమస్యగా భావిస్తూ.. యువత బాధలను దగ్గరగా చూసిన ఆయన, ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు తన వంతుగా పరిష్కార మార్గాలను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఉచితంగా అందుబాటులో ఉండేలా ఈ-క్లాసెస్ యాప్‌ను రూపొందించడంతోపాటు, మహిళలకు నైపుణ్య శిక్షణ అందించేందుకు శిఖర స్కిల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. నిరుద్యోగుల సమస్యలపై తన పోరాటం, వారి పట్ల తన తపన, చేపట్టిన కార్యక్రమాలను డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో తన రాజకీయ ప్రస్థానం, ప్రజా సమస్యలపై చేపట్టిన పోరాటం, సమకాలీన రాజకీయ అంశాలపై రాకేష్‌రెడ్డి ముచ్చటించారు.
స్పాట్ వాయిస్, ప్రధాన ప్రతినిధి: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నా బీజేపీ నుంచి టికెట్ రాలేదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత రాకేశ్‌రెడ్డి చెప్పారు. టికెట్ రాకపోవడంతో నాలాంటి వారికి సరైన గుర్తింపు లేదనే బాధతో బీజేపీని వదిలిపెట్టా. ఆ తర్వాత టీఆర్ఎస్ ఆహ్వానం మేరకు అందులోకి వెళ్లాను. బీఆర్ఎస్లో చేరిన నెలన్నర రోజులకే పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని చెప్పారు. అయితే ‘‘34 నియోజకవర్గాలు.. మూడు ఉమ్మడి జిల్లాలు. పోటీ చేద్దామా.. వద్దా అనుకున్నా. దీనికి తోడు అప్పుడు పార్టీ అధికారం కోల్పోవడం, వలసలు జరుగుతుండడంతో కాస్త భయం వేసింది. కానీ పార్టీ పెద్దలు ఇచ్చిన ప్రోత్సాహంతో ముందుకు వెళ్లా’’ అన్నారు.
11 రోజులే సమయంలోనే..
ఎమ్మెల్సీ ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే అభ్యర్థిగా ప్రకటించారని, మొత్తం 11 రోజుల సమయం మాత్రమే దొరికిందని, అందులో రెండు రోజులు నామినేషన్‌కే పోయిందని రాకేశ్ రెడ్డి తెలిపారు. ‘‘ప్రచారంలో కేటీఆర్, హరీశ్‌రావు పూర్తి స్థాయి బాధ్యతలు ఎత్తుకొని తిరిగారు. నేను ప్రచారం చేసినప్పుడు చూద్దాంలే అన్నట్టుగానే ఉన్నా. ప్రచారంలో దిగిన తర్వాత గెలుపుపై ధీమా పెరిగింది’’ అన్నారు. మల్లన్న అప్పటికే రెండుసార్లు ఓడిపోవడం, పట్టభద్రుల ఓటరు నమోదులో కీలక పరిస్థితులు ఉండటం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం వంటి అంశాలు ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపాయని రాకేశ్‌రెడ్డి తెలిపారు. ‘‘నేను కొత్తగా ఎమ్మెల్సీ బరిలో నిలవడం.. సమయం లేకపోవడంతో కాస్త వెనకబడ్డా. అతి తక్కువ టైం ఉన్నా సుమారు 10 వేల ఓట్ల తేడానే ఉంది. అయితే ఓడిపోయినా బాధపడలేదు. పార్టీ డిసప్పాయింట్ కావొద్దన్నది. పూర్తిగా సపోర్ట్‌గా నిలిచిందని గుర్తుచేశారు.
జనసభలో కొట్లాడతనని చెప్పిన..
పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం నుంచే ఓ మాట చెప్పానని రాకేశ్‌రెడ్డి గుర్తుచేశారు. ‘‘చట్టసభలోకి వెళ్లే ఛాన్స్ రాలేదు.. కానీ మళ్లీ జనసభలోకి వెళ్లి అవకాశం వచ్చింది. అక్కడి నుంచే కొట్లాడతా అని చెప్పిన. ఆ మాటకు కట్టుబడి ఉండి మూడేళ్లుగా పట్టభద్రుల కోసం ఫైట్ చేస్తున్న’’ అని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, 46 జీవోపై సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు చెప్పారు. గ్రూప్-1 అవకతవకలపై ప్రశ్నిస్తే పరువు నష్టం దావా కూడా వేశారని గుర్తు చేశారు. ఎంప్లాయీస్ కోసం కూడా పోరాడానని, పీఆర్సీ, డీఆర్ఎస్, ఓపీఎస్, టీచర్ల సమస్యలపై ప్రశ్నించినట్లు చెప్పారు. ‘‘పట్టభద్రుడైన ప్రతి ఒక్కరి సమస్యను నా సమస్యగా భావించి ప్రశ్నించిన. ప్రభుత్వాన్ని ఎదురించి పోరాడిన’’ అని పేర్కొన్నారు. డీఎస్సీ నిర్వహించకుండా టెట్ వేయడం ఏంటని ప్రశ్నించానన్నారు. నిరుద్యోగుల బాకీ కార్డు తీసినట్లు తెలిపారు. జలవిహార్‌లో 10 వేల మందితో సభ నిర్వహించానని, యూత్ సంగ్రామ సభలో కీలకంగా పనిచేశానని చెప్పారు. గ్రాడ్యుయేట్ సెక్షన్‌లోని ప్రతి సమస్యపై కొట్లాడానని, పట్టభద్రులు చేసిన ఆందోళనలకు పిలిస్తే వెళ్లానన్నారు.
‘నిరుద్యోగం ఒక సామాజిక సమస్య..
మూడేళ్లలో తన పోరాటానికి నిరుద్యోగుల నుంచి మంచి సపోర్ట్ వచ్చిందని రాకేశ్‌రెడ్డి చెప్పారు. ‘‘నిరుద్యోగం అనేది ఒక సామాజిక సమస్య. అన్నింట్లోకంటే ఇది చాలా పెద్దది. జీవితం అధ్వానంగా మారుతుంది. నిరుద్యోగి బాధలు చాలా దారుణంగా ఉంటాయి. వాటిని నేను దగ్గరుండి చూసిన. సమాజంలో వారిపట్ల ఒక చులకన భావం ఉంటుంది’’ అన్నారు. యువతకు ఉద్యోగం అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ అని చెప్పారు. ‘‘ఉద్యోగం కోసం ఎంత తిప్పలైనా పడతరు. ఎన్నేళ్లు అయినా వెయిట్ చేస్తరు. ఈ క్రమంలో వారి వయస్సు, కుటుంబం.. సరదాలు ఇలా అన్నీ మిస్ అయిపోతారు. ఏజ్ రిలేటెడ్ జాబ్స్ కోసం ప్రయత్నించే వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏజ్ అయిపోతుంటుంది. జాబ్స్ ప్రకటనపై స్పష్టత లేకపోవడంతో మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ప్రభుత్వం చేసే తప్పిదం వల్ల మానసిక సంఘర్షణకు గురై యువత దారి తప్పుతుంటారని వాపోయారు. యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని అయోమయ పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో నెలకొందన్నారు.
వేణు లేఖ.. కన్నీళ్లు తెప్పించింది
నిరుద్యోగుల సమస్యలో తనను అత్యంత బాధపెట్టిన ఘటనను రాకేశ్‌రెడ్డి గుర్తుచేశారు. ‘‘ఖమ్మంలో వేణు అనే నిరుద్యోగి సూసైడ్ చేసుకోవడం తనను తీవ్రంగా కలిచివేసింది. అతను రాసిన లెటర్ కన్నీళ్లు తెప్పించింది. నిరుద్యోగుల జీవితాన్ని కవిత రూపంలో ఆవిష్కరించాడు. ఇల్లు లేదు.. నాన్న తాటి చెట్లు ఎక్కుతడు. అమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. వేణుకు ఉద్యోగం చేయాలనేది కల’’ అని చెప్పారు.
లైబ్రరీలో కనిపించిన నిరుద్యోగుల బాధ
వరంగల్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లినప్పుడు అక్కడ చదువుకునే వారి బాధలను కళ్లతో చూశానన్నారు. ‘‘అక్కడ చదువుకునేందుకు వచ్చే పిల్లలు రూ.5 భోజనం చేస్తున్నారు. నేను కూడా వాళ్లతో పాటు భోజనం చేస్తూ మాట్లాడిన. ఐదు రోజుల భోజనం రోజు చేస్తారా అంటే ‘‘అవును అన్న. ఇక్కడ భోజనం మిస్ అయితే ఛాయ్‌తో కడుపు నింపుకోవాల్సిందే. ఇల్లు వదిలి వచ్చి మూడునాలుగేళ్లు అవుతోంది. ఇంకా తల్లిదండ్రులపైనా ఏం ఆధారపడతం’’ అని చెప్పడం చాలా బాధగా అనిచింది’’ అని రాకేశ్‌రెడ్డి తెలిపారు.
కోచింగ్ ఫీజు భారం లేకుండా.. ఈ-క్లాసెస్ యాప్
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి సిద్ధమయ్యే నిరుద్యోగుల్లో చాలామందికి ఖరీదైన కోచింగ్ సెంటర్ల ఫీజులు, ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఖర్చులు భరించే స్థోమత లేని ఎందరినో చూశానని రాకేశ్ రెడ్డి చెప్పారు. అలాంటి విద్యార్థులు, నిరుద్యోగులకు కొంతైనా ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ‘రాకేశ్‌రెడ్డి ఈ-క్లాసెస్ యాప్’ను రూపొందించినట్లు తెలిపారు. 2026 మే నెలలో ఖమ్మంలో ఈ యాప్‌ను ప్రారంభించామని, అనంతరం హన్మకొండలోనూ ఆవిష్కరించామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, నిరుద్యోగులకు కోచింగ్ ఫీజు, హాస్టల్ వంటి ఖర్చుల భారాన్ని తగ్గించడమే దీని ఉద్దేశమన్నారు. పోటీ పరీక్షలకు సంబంధించిన కోర్సులు, స్టడీ మెటీరియల్, మాక్ టెస్టులు, అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధనను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొచ్చేలా దీనిని రూపొందించిన్నట్లు చెప్పారు. నిరుద్యోగుల కోసం తాను కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే పరిమితం కాలేదని, వారి సమస్యకు తన వంతుగా పరిష్కారం చూపే ప్రయత్నం కూడా చేస్తున్నానని చెప్పేందుకు ఈ-క్లాసెస్ యాప్‌ను తెచ్చానన్నారు.
ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి దారుణం
ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య వర్ణణాతీతమని రాకేశ్‌రెడ్డి వాపోయారు. రాష్ట్రంలో 8 లక్షల మంది ఉద్యోగులు ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు 3 లక్షలు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 5 లక్షలు ఉంటారు. వాళ్లను ఏజెన్సీల ద్వారా రిక్రూట్ చేసుకోవడం వల్ల జీతాలు సరిగా రాక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని శాఖల్లో అయితే ఆరు నెలలైనా జీతం పడడం లేదని చెప్పారు. ఎన్నటికైనా ప్రభుత్వ ఉద్యోగులం కాలేకపోతమా అనే ఒక్క చిన్న ఆశతో ఉద్యోగం చేస్తుూనే ఉన్నారు. కానీ, వాళ్లు ఔట్సోర్సింగ్ లో స్టార్ట్ అయి.. ఔట్సోర్స్లోనే రిటైర్ అవుతున్నారన్నారు. వాళ్లకు కూడా ప్రభుత్వం నుంచి జీతభత్యాలు ఇవ్వాలి. వాళ్ల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందులోంచి జీతాలు ఇవ్వాలి. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను గుర్తించి వాళ్లకు హెల్త్ కార్డు, ఈఎస్ ఐ, పీఎఫ్ , ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఉపాధి కల్పనకే ‘‘శిఖర స్కిల్ సెంటర్’’
నిరుద్యోగ సమస్యను కేవలం ఉద్యోగ నోటిఫికేషన్లు, పోటీ పరీక్షల కోణంలోనే చూడకుండా.. నైపుణ్యాలు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా కూడా కొంతవరకు పరిష్కరించవచ్చని ఆలోచనతో ‘శిఖర స్కిల్ సెంటర్’ ను ప్రారంభించి మహిళలు ఉచితంగా వృత్తి నైపుణ్య శిక్షణను ఇస్తున్నట్లు రాకేశ్ రెడ్డి తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వయం ఆధారితంగా మారేలా టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్ వంటి శిక్షణలను అందిస్తున్నారు. శిక్షణ పొందిన తర్వాత ఉద్యోగం చేసుకోవడంతో పాటు సొంతంగా ఉపాధి, చిన్న వ్యాపారం ఏర్పాటు చేసుకునే అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ‘‘ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండదు. ఉపాధి కల్పించినా నిరుద్యోగాన్ని తగ్గించవచ్చు. ముఖ్యంగా మహిళలు ఒక నైపుణ్యం నేర్చుకుని తమ కాళ్లపై తాము నిలబడాలి. అందుకే శిఖర స్కిల్ సెంటర్ ద్వారా వారికి అవసరమైన నైపుణ్యాల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు రాకేశ్ రెడ్డి చెప్పారు.
ఖమ్మంపై ఈసారి ప్రత్యేక దృష్టి..
గత పట్టభద్రుల ఎన్నికల్లో తనకు ఖమ్మంలో తక్కువగా ఓట్లు వచ్చాయని, అందుకే ఈసారి అక్కడ ఎక్కువగా ఫోకస్ చేశానని రాకేశ్‌రెడ్డి చెప్పారు. ఖమ్మం రాకేశ్‌రెడ్డి పుట్టిన గడ్డ అనే స్థాయిలో తిరిగానని, కార్యక్రమాలు చేసిన. అక్కడి పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులు అంతా అదే స్థాయిలో రిసీవ్ చేసుకున్నరని చెప్పారు. పట్టభద్రులకు అండగా నిలవాలని, వాళ్ల సమస్యలపై కొట్లాడాలని సంకల్పించుకొని మూడేళ్లు కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగానన్నారు. ‘‘గోదావరి ఇవతల.. అవతల పరుగులు తీసినట్టే సాగింది ఈ మూడేళ్లు’’ అని చెప్పారు.
మూడు జిల్లాలు.. విభిన్న నేపథ్యాలు ..
ఎమ్మెల్సీ బరిలో నిలవడం, ప్రచారం చేయడం, ఇప్పుడు సమస్యలపై తిరగడం తనకు గొప్ప అనుభవమని రాకేశ్‌రెడ్డి చెప్పారు. మూడు ఉమ్మడి జిల్లాలు వరంగల్-నల్గొండ-ఖమ్మం మూడు విభిన్న నేపథ్యాలున్న ప్రాంతాలు. వైల్డ్ వెరైటీ. జాగ్రఫికల్గా పట్టు సాధించిన. ఒక్కో జిల్లాలో ఒక్కో తీరు. ఎమ్మెల్సీ అనేది కలలో కూడా ఊహించలే. కానీ నాకు ఒక మంచి అనుభవాన్ని ఇచ్చింది’’ అన్నారు.
కేసీఆర్ ఒక శిఖరం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రాకేశ్‌రెడ్డి తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ లాంటి నాయకుడు మరొకరు ఉండరు. రారు. ఆయన ఓ శిఖరం. ఆయనకు ఆయనే సాటి. కేసీఆర్ ఉద్యమ నేతగా అందరూ ఆదరించే వ్యక్తి. తెలంగాణ కోసం కొట్లాడి సాధించి చూపించిండు. ఎందుకోసం తెలంగాణ తెచ్చుకున్నమో.. ఆ సమస్యలను పరిష్కరించారని చెప్పారు. రైతుబంధు, ఫ్లోరోసిస్ సమస్యను గట్టెక్కించేందుకు మిషన్ భగీరథ, నేత కార్మికుల కోసం చేనేత బంధు, కల్యాణలక్ష్మి ఇలా ప్రతి ఒక్కటి ఆయన సమస్యలను కళ్లతో చూసి పెట్టినవేనన్నారు. తెలంగాణలోని ప్రతి సమస్యపై ఆయనకు అవగాహన ఉందని, ఆయన ఎప్పుడు ఖాళీగా ఉండరని, బయటికి రారు అని అంతా అంటూ ఉంటారని, కానీ రాష్ట్రంలోని సమస్యలపై మేథోమథనం చేస్తుంటారని తెలిపారు.
కేసీఆర్‌తో ఒకసారి లంచ్ చేస్తూ జరిగిన సంభాషణను కూడా రాకేశ్‌రెడ్డి గుర్తుచేశారు. నా పొలంలో నీళ్లు ఎలా ఉన్నాయో.. ఎరువులు సరిపడా ఉన్నాయో లేవో ఎలా చూసుకుంటానో.. రాష్ట్రంలోని ప్రతి పొలాన్ని అలాగే చూసుకోవాలని నా కోరిక అని కేసీఆర్ చెప్పారు. అందుకే నేను ఎప్పుడు రివ్యూలు పెట్టినా ఫస్ట్ వ్యవసాయం, రైతులపైనే ఉండేదన్నారని తెలిపారు.
జెన్ జీలకు సరైన నాయకుడు కేటీఆర్..
కేటీఆర్ ప్రస్తుత జనరేషన్‌కే కాకుండా రానున్న తరాలను కూడా ఆలోచిస్తుంటారని రాకేశ్‌రెడ్డి అన్నారు. కేటీఆర్ అంటే ఫ్రాంమ్ట్ లీడర్. ఎప్పుడు కొత్త కోణంలో రాజకీయం చేయాలని చెబుతుంటాడు. ఇప్పుడు నాయకులంతా జెన్‌జీ గురించి మాట్లాడుతున్నారు. కానీ, ఆయన ఐటీ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఐటీ హబ్, టీఎస్ఐపాస్ ఇలా ఎన్నో వారి కోసమే తీసుకొచ్చారు. జెన్జీలు పాలనలో వేగం, కచ్చితత్వాన్ని కోరుకుంటారని, ఇవన్నీ ఆయనలో ఉన్నాయని, జెన్‌జీ తరానికి ఆయనే సరైన నాయకుడని అన్నారు. హరీశ్‌రావు మంచి ఛరిష్మా ఉన్న లీడర్ అని చెప్పారు.
ఈసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం..
ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని రాకేశ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్పై యువతలో కొంత వ్యతిరేకత ఉన్నది వాస్తమే. కానీ ఇప్పుడు ఆ భావన పోయింది. కేసీఆర్ హయాంలోనే 2 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. నోటిఫికేషన్లు వచ్చాయనే విషయం వాళ్లకు అర్థమైంది. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల ఆశలతో ఆడుకుంది. ఈ విషయాన్ని గమనించారని అన్నారు. సింగరేణిలో కారుణ్య నియామకాలను కూడా ప్రస్తావించారు. సింగరేణిలో కారుణ్య నియామకాలు చాలా పెద్ద విజయం. సింగరేణిలో 38 వేల ఉద్యోగాలుంటే అందులో దాదాపు 19 వేలు కారుణ్య నియామకాలు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయి. కేసీఆర్ ఏనాడు ఉద్యోగాలు ఇచ్చి నియామక పత్రాలు అందించలేదు. ప్రచారం చేసుకోలేదని పేర్కొన్నారు.
నిరుద్యోగుల సమస్యలను జపించిన..
ఈ మూడేళ్లలో రామకోటి రాసినదానికంటే ఎక్కువగా నేను నిరుద్యోగుల సమస్యను పట్టించుకున్నానని రాకేశ్ రెడ్డి చెప్పారు. నేను ఇచ్చే హామీ ఒక్కటే.. ప్రభుత్వాన్ని నిజాయితీగా నిలదీస్తా. పట్టభద్రుల సమస్యలపై నిజాయితీగా కొట్లాడతా. పెద్దల సభా గౌరవం పెంచేలా వ్యవహరిస్తా. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వానికి వారధి అవుతా. ఏ సమస్యల కోసం కొట్లాడిన్నో.. ఆ సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని పేర్కొన్నారు. మూడు ఉమ్మడి జిల్లాల్లోని నేతలంతా తనకు సహకరిస్తున్నారని తెలిపారు. కేటీఆర్, హరీశ్‌రావు చెరి సగం చూసుకుంటారు. అందరితో కలిసి పోయిన. తాజాగా కేటీఆర్ మూడు జిల్లాల నాయకులతో సమావేశమై.. ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీని బీఆర్ ఎస్ కైవసం చేసుకోవాలని సూచించారు. లాస్ట్ టైం దగ్గరకు వచ్చి పోయింది. ఈసారి విజయం తప్పకుండా సాధిస్తానని రాకేశ్‌రెడ్డి అన్నారు.
ప్రజలే తన రాజకీయ ఆస్తి..
ఉద్యోగాన్ని, సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం పనిచేయడం తనకు సంతృప్తినిస్తోందని రాకేశ్‌రెడ్డి చెప్పారు. ఏడేళ్ల పాటు ఉద్యోగం చేసిన. రాజకీయాలంటే ఇష్టం ఉండడంతో 2013లో ఉద్యోగం బంద్ చేసి బీజేపీలో చేరిన. సమస్యలు చూస్తూ.. ఎదుర్కొంటూ పెరిగిన. వాటిని పరిష్కరించేలానే ఆలోచనతో వచ్చానని తెలిపారు. రాజకీయ ప్రయాణంలో ఆస్తులు అమ్ముకున్నా ప్రజలతో ఏర్పడిన అనుబంధమే తనకు పెద్ద సంపద అని చెప్పారు. నా రాజకీయ ప్రయాణంలో నా మిత్రుల సహకారం సైతం ఉంది. నేను ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండడం.. ప్రజల కోసం కొట్లాడడం వల్లే నాకు ఈ గుర్తింపు వచ్చిందని నమ్ముతా. రాజకీయంలో ఆస్తులు అమ్ముకున్న బాధ కంటే పోగు చేసుకున్న జనం ఎక్కువ అనే ఆనందం ఉంది. ‘‘నేను యూత్ కావడంతో నా వెంట యూత్ ఎక్కువగా ఉండేవారు. రాజకీయాల్లోకి యూత్ రావాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే నాకు వారి నుంచి మంచి ప్రోత్సాహం లభించింది.
రూ.24 లక్షల ప్యాకేజీ వదిలి.. రాజకీయాల్లోకి..
హసన్‌పర్తి మండలం వంగపహాడ్ తన స్వగ్రామమని రాకేశ్‌రెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు గోపాల్‌రెడ్డి, కోమల, తమ్ముడు సుఖేష్‌రెడ్డి. పదో తరగతి వరకు వరంగల్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఇంటర్ గుంటూరులో పూర్తి చేశారు. స్టేట్‌లో 9వ ర్యాంకు రావడంతో బిట్స్ పిలానీలో అడ్మిషన్ పొందారు. అక్కడ ఉన్నప్పుడే స్టూడెంట్ ఆర్గనైజేషన్‌లో పనిచేశారు. ఏడేళ్లపాటు సిటీ బ్యాంక్, ఫేస్బుక్ లాంటి సంస్థల్లో పనిచేశారు. ఉద్యోగం వదిలే సమయానికి ఏడాదికి రూ.24 లక్షల ప్యాకేజీ ఉండేదన్నారు. ‘‘సమస్యలు చూస్తూ.. ఎదుర్కొంటూ పెరిగిన. వాటిని పరిష్కరించేలానే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన. బీజేపీలో ఇంటింటికీ పోయిన. చాలా కార్యక్రమాలు చేసిన’’ అని రాకేశ్‌రెడ్డి చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మూడు ఎకరాల భూమిని అమ్ముకున్నానని తెలిపారు.
వరంగల్‌లో ఇంటింటికీ వెళ్లిన అనుబంధం..
వరంగల్ ఒక స్మార్ట్ సిటీ అయినప్పటికీ అందులోని స్లమ్ సిటీని తాను దర్శించుకున్నానని రాకేశ్‌రెడ్డి చెప్పారు. వరంగల్‌లోని జనాభాలో 70 శాతం మంది ఇక్కడే ఉంటారన్నారు. బీజేపీలో ఉన్నప్పుడు ఒక కసితో పని చేసిన. వరంగల్‌లో పట్టు సాధించిన. ప్రతీ ఇంటిలో 10 నిమిషాలు కూర్చొని వాళ్ల కష్టసుఖాలు తెలుసుకున్న. వాళ్లు కూడా నన్ను అంతే ఆప్యాయతతో రిసీవ్ చేసుకున్నరన్నారు.
తెలంగాణ ఎకానమీ ఫస్ట్ బుక్ నాదే
తన సబ్జెక్ట్ ఎకానమీ కావడంతో ఆర్థిక, సామాజిక అంశాలపై ఎప్పటి నుంచో ప్రత్యేక ఆసక్తి ఉందని రాకేష్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ సమాజం, ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తూ ప్రముఖ దినపత్రిక ‘ఈనాడు’లో సెంటర్ పేజీ వ్యాసాలు రాశానన్నారు. వాటిని సంకలనం చేసి ‘ప్రగతి రథ చక్రాలు’ పుస్తకాన్ని రచించానని తెలిపారు. ఆ పుస్తకానికి ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు స్వయంగా ముందుమాట రాయడం మర్చిపోలేని విషయమన్నారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ వంటి సంస్థల ఆహ్వానం మేరకు అతిథి అధ్యాపకుడిగా పాల్గొని విద్యార్థులకు ఆర్థిక, సామాజిక, సమకాలీన అంశాలపై ప్రత్యేక తరగతులు నిర్వహించానన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకం అవసరమని భావించి, లక్షలాది మంది విద్యార్థులకు ఉపయోగపడేలా తెలుగులో, ఇంగ్లీషులో ‘తెలంగాణ ఎకానమీ’ పుస్తకాన్ని రచించానని చెప్పారు. అలాగే ‘నవశకానికి నాంది’ వంటి పుస్తకాలను కూడా రచించినట్లు రాకేష్‌రెడ్డి వివరించారు.