హైదరాబాద్, స్పాట్ వాయిస్: ప్రజారోగ్య భద్రత దృష్ట్యా రాష్ట్రంలో నాన్-డెయిరీ, అనలాగ్, కృత్రిమ పనీర్ తయారీ, విక్రయాలపై తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. సెప్టెంబర్ 10 నుంచి ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. పనీర్ పేరుతో కృత్రిమ పదార్థాల తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలను నిషేధించినట్లు టీజీ-సేఫ్ తెలిపింది. ఇటీవల తనిఖీల్లో రూ.7.19 లక్షల విలువైన టన్ను పామాయిల్, 476 కిలోల గ్లిజరాల్ మోనోస్టియరేట్, 150 కిలోల నాణ్యతలేని పాలపొడిని సీజ్ చేశారు. పలు డెయిరీల్లో ఈగలు, బొద్దింకలు, మురుగునీరు కనిపించడంతో నోటీసులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆహార భద్రత చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పాలకు బదులుగా వెజిటబుల్ ఆయిల్స్, రసాయనాలతో తయారయ్యే అనలాగ్ పనీర్ ఆరోగ్యానికి హానికరమని నిపుణులు పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.