SPOT VOICE
Newspaper Banner
Date : 14 September 2026, 7:14 pm Posted By : SPOT VOICE MEDIA

బిడ్డతో సంబంధం లేదన్న మురళి.. సుస్మిత ఎటువైపు?

స్పాట్ వాయిస్, బ్యూరో : పరకాల రాజకీయాల్లో కొండా సుస్మిత అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో పరకాల నుంచి సుస్మిత పోటీ చేస్తారని కొండా మురళి ప్రకటించగా, తాజాగా ఆమెతో తనకు సంబంధం లేదంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ఒకవైపు కాంగ్రెస్‌లో పరకాల అభ్యర్థిగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి పేరు ఖరారవడం, మరోవైపు కొండా కుటుంబం నుంచి సుస్మిత విషయంలో భిన్న సంకేతాలు వెలువడటం ఆసక్తి రేపుతోంది. ఇంతకాలం సుస్మితను రాజకీయ వారసురాలిగా ప్రస్తావించిన మురళి ఇప్పుడు వెనక్కి తగ్గడం వెనుక కారణమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో సుస్మిత జనసేన నేతలతో చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో మరింత ఉత్కంఠ పెంచుతోంది. జనసేన నుంచి పరకాల బరిలో నిలిచేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారా? లేక కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ మరో రాజకీయ నిర్ణయం తీసుకోనున్నారా? అన్నదానిపై జోరుగా చర్చ సాగుతోంది. అయితే జనసేన నుంచి పోటీపై సుస్మిత నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో కొండా సుస్మిత తదుపరి రాజకీయ అడుగు పరకాల రాజకీయ సమీకరణాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.