SPOT VOICE
Newspaper Banner
Date : 07 September 2026, 12:04 pm Posted By : SPOT VOICE MEDIA

10న ‘చలో హైదరాబాద్‌’ను విజయవంతం చేయండి

​రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక 300 మంది విశ్రాంత ఉద్యోగుల మృతి

 

​ఈ మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం

 

​టాప్రా జిల్లా అధ్యక్షుడు బోనాల రాజమౌళి

 

స్పాట్ వాయిస్, ​గణపురం:రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక, తీవ్ర అనారోగ్యానికి గురై సరైన వైద్యం చేయించుకోలేక రాష్ట్రంలో ఇప్పటివరకు 300 మందికి పైగా విశ్రాంత ఉద్యోగులు మృతి చెందారని, ఈ విషాదకర మరణాలకు ముమ్మాటికీ ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్య వైఖరే కారణమని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ (టాప్రా) జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు బోనాల రాజమౌళి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా, దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 10న తలపెట్టిన ‘చలో హైదరాబాద్‌’ ధర్నాకు జిల్లాలోని పెన్షనర్లు అందరూ భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏళ్ల తరబడి ప్రజలకు నిస్వార్థ సేవ చేసి వృద్ధాప్యంలో ప్రశాంతంగా గడపాల్సిన విశ్రాంత ఉద్యోగులను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నారు. ఉద్యోగ విరమణ చేసి ఏళ్లు గడుస్తున్నా గ్రాట్యుటీ, కమ్యుటేషన్, సరెండర్ లీవ్ నగదును విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. తమ సొంత హక్కుల కోసమే వృద్ధాప్యంలో కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ​ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు ఎంప్లాయీస్ హెల్త్ కార్డులను తిరస్కరిస్తున్నాయని, సరైన సమయంలో అత్యవసర వైద్యం అందక పలువురు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే రావాల్సిన డీఏ బకాయిలను విడుదల చేయాలని, పీఆర్‌సీ నివేదికను వెల్లడించాలని, పెండింగ్ బిల్లులన్నింటినీ వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికొదిలేయడం తగదని, మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్‌లో జరిగే ధర్నాలో జిల్లాలోని విశ్రాంత ఉద్యోగులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.