కుడా కుర్చీ.. కాంగ్రెస్‌లో కుంపటి..!
టీడీపీ బ్యాచ్ కే ఇచ్చారంటూ గుసగసలు
వరంగల్ లో సెకండ్ కేడర్ నేతల నారాజ్..
పార్టీని నమ్ముకున్న మాకే ఎందుకీ ఝలక్..?
స్పాట్‌వాయిస్, వరంగల్: కుడా చైర్మన్ కుర్చీ వరంగల్ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ కుంపటిని రాజేసింది. మంత్రి నుంచి కొండా సురేఖను తప్పించి.. నష్ట నివారణ కోసం గుండు సుధారాణిని కుడా చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. పార్టీలో పదవుల కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న సెకండ్ కేడర్ నేతలకు మింగుడుపడటం లేదు. అధికారం వచ్చిన తర్వాత తమకు ఏదో ఒక కీలక పదవి దక్కుతుందని ఆశించిన నేతలకు తాజా నియామకం తీవ్ర నిరాశను మిగిల్చినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
కష్టకాలంలో మేం.. పదవుల వేళ వాళ్లా..?
కాంగ్రెస్ అధికారంలో లేని సమయంలో పార్టీ జెండాను మోసిన నేతలు, ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కేడర్.. ఇప్పుడు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఇతర కీలక బాధ్యతల్లో తమకు అవకాశం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే వరంగల్ లో కీలకమైన కుడా చైర్మన్ ను టీడీపీ మూలాలున్న వారికి కేటాయించడంతో సెకండ్ కేడర్‌లో అసంతృప్తి రగులుకుంది.
మాకెందుకు ఈ శిక్ష..?
తాజాగా కుడా చైర్మన్ పదవి విషయంలోనూ ఇదే భావన బలపడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లోనే ఉంటూ పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా.. గతంలో టీడీపీ రాజకీయాలతో అనుబంధం ఉన్న గుండు సుధారాణికి అవకాశం ఇవ్వడంపై కొందరు నేతలు అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ‘పార్టీని నమ్ముకున్నాం.. అధికారంలోకి వస్తే మా కష్టానికి గుర్తింపు ఉంటుందని భావించాం. కానీ మా ఆశలే మాకు శాపమయ్యాయా?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
కుడా కుర్చీ.. పెద్ద సంకేతమేనా?
ఈ ఒక్క నియామకాన్ని సెకండ్ కేడర్ నేతలు సాధారణ పదవి భర్తీగా చూడటం లేదని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ. భవిష్యత్‌లో నామినేటెడ్ పదవుల పంపకంలో తమ పరిస్థితి ఎంత దారుణంగా ఉండనుందనే దానికి ఇది సంకేతంగా భావిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పదవుల కోసం ఎదురు చూస్తున్న పలువురు నేతలకు తాజా పరిణామం మరింత నిరుత్సాహం కలిగించినట్లు తెలుస్తోంది. ఒకవైపు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని అధిష్ఠానం భావిస్తుంటే.. మరోవైపు పదవుల కోసం ఎదురుచూస్తున్న కేడర్‌లో అసంతృప్తి పెరుగుతుండటం కాంగ్రెస్ నాయకత్వానికి కొత్త తలనొప్పిగా మారుతోంది. కుడా కుర్చీ మారింది.. కానీ ఆ కుర్చీ చుట్టూ మొదలైన కుంపటి ఎక్కడి వరకు వెళ్తుందన్నదే ఇప్పుడు వరంగల్ కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్. ఈ మేరకు అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అంటూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ జెండాను మార్చి వైరల్ చేస్తున్నారు.