SPOT VOICE
Newspaper Banner
Date : 27 September 2026, 9:46 am Posted By : SPOT VOICE MEDIA

కాళేశ్వరం బ్యారేజీల రిపేర్

  • నవంబర్ లో ప్రారంభం

  • 2027 పంటలకు నీరు

స్పాట్ వాయిస్ , హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమగ్ర పునరుద్ధరణ పనులను నవంబర్‌ రెండో వారంలో ప్రారంభించి, 2027 వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్‌ బేగంపేట కుందన్‌బాగ్‌లోని తన అధికారిక క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో మంత్రి బ్యారేజీల పునరుద్ధరణ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. మూడు బ్యారేజీల భద్రతను మరింత పటిష్టం చేయడంతోపాటు, వాటి నిర్వహణ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు అవసరమైన డిజైన్లను ప్రభుత్వం ఖరారు చేసిందని తెలిపారు.

పునరుద్ధరణ పనుల్లో కీలక అంశాలు

  • ప్రాజెక్టు డిజైనర్‌ రూపొందించిన పునరుద్ధరణ ప్రణాళికలో పలు కీలక పనులు ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో:

  • గ్రౌటింగ్‌ ద్వారా బ్యారేజీల పునాదులను బలోపేతం చేయడం

  • స్టిల్లింగ్‌ బేసిన్లను పొడిగించడం

  • కొత్తగా కట్‌-ఆఫ్‌ వాల్స్‌ నిర్మించడం

  • వరద ప్రవాహ వేగాన్ని నియంత్రించే ఏర్పాట్లలో ఉన్న లోపాలను సరిచేయడం

  • పునాదుల స్థిరత్వాన్ని మరింత పెంచడం

  • పునాదుల కిందకు నీరు చొరబడకుండా చర్యలు చేపట్టడం

  • వంటి పనులు ఉన్నాయని వివరించారు.

జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (NDSA)తో పాటు ఇతర నిపుణుల కమిటీలు చేసిన సూచనలు, వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని పునరుద్ధరణ ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు.

“బ్యారేజీల నిర్మాణ భద్రత, పునరుద్ధరణ పనుల నా ణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. శాస్త్రీయ అధ్యయనాలు, జాతీయ స్థాయి సాంకేతిక సంస్థల సిఫార్సుల ఆధారంగానే ప్రతి పని జరుగుతుంది” అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

సమీక్ష సమావేశంలో నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో పాటు కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ కార్యక్రమంతో సంబంధం ఉన్న ఇంజినీర్లు పాల్గొన్నారు.