పారిశుధ్యానికి ప్రాధాన్యం
హన్మకొండకు అభివృద్ధి ప్రణాళిక
ముంపు నివారణకు పకడ్బందీ చర్యలు
రూ.5 వేల కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ
రూ.500 కోట్లతో వాటర్ వర్క్స్.. 40 ఏళ్ల ముందుచూపు
మల్టీలెవల్ పార్కింగ్.. చౌరస్తా రీడెవలప్‌మెంట్
వరంగల్ కోట, భద్రకాళి.. కొత్త టూరిజం హంగులు
స్పాట్ వాయిస్, ప్రధానప్రతినిధి: హన్మకొండ నగర అభివృద్ధికి భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నామని కలెక్టర్, కుడా వైస్ చైర్మన్ చాహత్ బాజ్‌పాయి తెలిపారు. నగరంలోని పార్కింగ్, డ్రైనేజీ, తాగునీరు, ముంపు, పారిశుధ్యం సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు వరంగల్ కోట, భద్రకాళి తదితర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. హన్మకొండ చౌరస్తా రీడెవలప్‌మెంట్, మల్టీలెవల్ కార్ పార్కింగ్, రూ.5 వేల కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రూ.500 కోట్ల వాటర్ వర్క్స్ వంటి కీలక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. నగర అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. మంగళవారం తన చాంబర్‌లో డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో జిల్లా, నగర అభివృద్ధి పనులపై ఆమె వివరాలు వెల్లడించారు.
పార్కింగ్‌కు మల్టీలెవల్ పరిష్కారం
హన్మకొండలో తీవ్రంగా ఉన్న పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మల్టీలెవల్ కార్ పార్కింగ్ నిర్మాణానికి అడుగులు పడ్డాయని కలెక్టర్ తెలిపారు. అశోక హోటల్ ఎదురుగా ఉన్న కుడా స్థలంలో నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. సీ-షేప్‌లో నిర్మాణం చేపట్టి పార్కింగ్‌తో పాటు ముందు భాగంలో కమర్షియల్ షాపులను లీజుకు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందన్నారు. ఈ ఫైల్ ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని వివరించారు.
చౌరస్తాకు కొత్త రూపం
హన్మకొండ చౌరస్తాను రీడెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నామని చాహత్ బాజ్‌పేయి తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్, దాని చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాలను కలుపుకొని ప్లాజా నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. ఈ అంశంపై ఆర్టీసీ అధికారులతో చర్చిస్తున్నామని, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కూడా ప్రతిపాదన వివరించినట్లు వెల్లడించారు. మల్టీలెవల్ పార్కింగ్, ప్లాజా నిర్మాణంతో ప్రధాన కూడలిలో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడంతో పాటు వాణిజ్య కార్యకలాపాలకు ఊతం లభిస్తుందని తెలిపారు.
రూ.5 వేల కోట్ల డ్రైనేజీ
గ్రేటర్ వరంగల్ పరిధిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కలెక్టర్ తెలిపారు. సుమారు రూ.5 వేల కోట్లతో చేపట్టనున్న ఈ భారీ ప్రాజెక్టుపై సీపీఎచ్‌ఓ పరిశీలన కొనసాగుతోందన్నారు. నగరంలో ముంపు నివారణకు రిటర్నింగ్ వాల్స్, డ్రైనేజీలు, నాలాల అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యమన్నారు.
రూ.500 కోట్లతో వాటర్ వర్క్స్
నగర తాగునీటి వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. నల్లా పైపుల పునరుద్ధరణ పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయిందని, పైపుల సామర్థ్యం పెంచుతున్నామని చెప్పారు. కొత్త పైపులైన్లు, వాటర్ ట్యాంకులు, వాటర్ ప్లాట్ల ఏర్పాటు తదితర పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. 30-40 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నగర వాటర్ వర్క్స్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
కోట చుట్టూ బోటింగ్
వరంగల్ కోటను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కుడా ఆధ్వర్యంలో చర్యలు వేగవంతం చేసినట్లు చాహత్ బాజ్‌పేయి తెలిపారు. సుమారు నాలుగు కిలోమీటర్ల మేర కోట చుట్టూ ఉన్న రక్షణ కందకాన్ని పునరుద్ధరించి బోటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ పనులకు ప్రపంచ బ్యాంకు సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. భద్రకాళి ఆలయ అభివృద్ధికి రూ.90 కోట్ల ఎస్డీపీ నిధులు కేటాయించారని, భద్రకాళి బండ్ వద్ద పెండింగ్‌లో ఉన్న స్టోన్ వర్క్‌కు రూ.19 కోట్లతో టెండర్లు పిలిచామని వెల్లడించారు.
దేవునూరు గుట్టలపైనా దృష్టి
ధర్మసాగర్ మండలంలోని దేవునూరు గుట్టలను అటవీశాఖ సహకారంతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ధర్మసాగర్ రిజర్వాయర్, అటవీ ప్రాంతాన్ని కలుపుకొని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. శిల్పారామం ఏర్పాటుకు రెండు స్థలాలు పరిశీలనలో ఉన్నాయని, శాయంపేట స్థలం అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్వహణపై దృష్టి
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రగతిలో ఉందని, పనుల్లో మరింత వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చాహత్ బాజ్‌పేయి తెలిపారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ వందశాతం పూర్తయిందని చెప్పారు. అయితే కొన్ని ప్రాంతాల్లో నీటి వసతి, డ్రైనేజీ సమస్యలు లబ్ధిదారులు తమ దృష్టికి తీసుకొస్తున్నారని తెలిపారు. అంబేద్కర్‌నగర్‌లోని డబుల్ బెడ్‌రూం ఇళ్ల సముదాయంలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కార్పొరేషన్ అధికారులు టెండర్లు పిలిచారని, త్వరలో పనులు పూర్తవుతాయని చెప్పారు. కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులు నివసిస్తున్నారా లేదా అనే అంశంపై ఆక్యుపెన్సీ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అర్హులైన వారు ఇళ్లను వినియోగించుకోవాలన్నదే ఈ ప్రక్రియ ఉద్దేశమన్నారు.
పారిశుధ్యంపైనా ఫోకస్
నగరంలో శానిటేషన్ క్లియరెన్స్‌ను సవాల్‌గా తీసుకుని పనిచేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. చెత్తను డంపింగ్ చేయకుండా బయోమైనింగ్, బయో సీఎన్జీ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. డంపింగ్ యార్డు విషయంలో కొత్తగా వెతుకులాట చేయడం లేదని, అందుబాటులో ఉన్న వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. నగర పరిశుభ్రత, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల సముదాయాల్లో నిర్వహణ మెరుగుపరిచేందుకు సొసైటీలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
అర్హులైన ఓటర్ల పేర్లు తొలగకుండా చర్యలు
ఎస్‌ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని, ఈ ప్రక్రియపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించామని చాహత్ బాజ్‌పేయి తెలిపారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. బూత్ లెవల్ అధికారులు కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని వెల్లడించారు. ప్రతి అర్హుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రజలు తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని సవరణలు అవసరమైతే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.

ఐఏఎస్ కావాలన్న లక్ష్యంతో సివిల్స్‌లోకి
మధ్యప్రదేశ్‌లోని గుణలో టెన్త్ వరకు చదువుకున్నానని, ఇంటర్ విద్యను గ్వాలియర్‌లో పూర్తి చేశానని చాహత్ బాజ్‌పేయి తెలిపారు. 2016లో ఐఐటీ కాన్పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశానని చెప్పారు. తన తండ్రి ఇంజనీరింగ్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారని, ఆయన ఉన్నతాధికారులతో పనిచేసిన అనుభవాలు, కలెక్టర్ స్థాయి బాధ్యతల గురించి చెప్పే విధానం తనపై ప్రభావం చూపిందన్నారు. ప్రజలకు ఎక్కువగా సేవ చేసే అవకాశం సివిల్ సర్వీసుల్లో ఉంటుందని భావించి ఆ దిశగా అడుగులు వేశానని తెలిపారు. ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలోనే తొలిసారి సివిల్స్ పరీక్ష రాశానని, మూడో ప్రయత్నంలో విజయం సాధించానని చెప్పారు. సివిల్స్ శిక్షణ సమయంలోనే వరుణ్ రెడ్డితో పరిచయం ఏర్పడిందని తెలిపారు.