SPOT VOICE
Newspaper Banner
Date : 11 September 2026, 11:32 am Posted By : SPOT VOICE MEDIA

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ తండ్రి ఆత్మహత్యాయత్నం

స్పాట్ వాయిస్, వరంగల్: మాజీ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌ తండ్రి సుబ్రహ్మణ్యం శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. 40 నిద్రమాత్రలు మింగిన ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన వరంగల్‌లోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా, హైదరాబాద్‌ మేడిపల్లి ప్రాంతానికి చెందిన హరికృష్ణపై దాడి చేశారనే ఆరోపణలతో సుమంత్‌తో పాటు మరికొందరిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో ఏ-1గా ఉన్న సుమంత్‌ హైకోర్టును ఆశ్రయించగా ముందస్తు బెయిల్‌ లభించింది. కేసు విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. దీంతో గురువారం సుమంత్‌ తన న్యాయవాదులతో కలిసి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విచారణకు హాజరయ్యారు. అనంతరం అవసరమైనప్పుడు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.