SPOT VOICE
Newspaper Banner
Date : 24 September 2026, 2:24 pm Posted By : SPOT VOICE MEDIA

కాంగ్రెస్‌ వచ్చింది.. కరెంట్‌ పోయింది

సింగరేణి, కేటీపీపీని నిర్వీర్యం చేస్తున్నారు..

బొగ్గు కొరతతో విద్యుత్‌ ఉత్పత్తి పడిపోయింది

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలి

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

స్పాట్‌ వాయిస్‌, గణపురం: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. వ్యవసాయానికి రోజుకు నాలుగైదు గంటలు కూడా విద్యుత్‌ అందని పరిస్థితి నెలకొందని, నీళ్లు రాక, కరెంట్‌ లేక పంటలు ఎండిపోతుంటే రైతులు సబ్‌స్టేషన్ల వద్ద నిరసనలు, రాస్తారోకోలు చేస్తున్నారని అన్నారు. రైతుల ఆందోళనలను పోలీసులు అణచివేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ పాలనలో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందిస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్లీ కరెంట్‌ కోతల రోజులను తెచ్చిందని మండిపడ్డారు.

కేటీఆర్‌ ఆదేశాల మేరకు గురువారం బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురంలోని కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ (కేటీపీపీ)ని సందర్శించిన ఎర్రబెల్లి.. ప్లాంట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడే నాటికి 7,778 మెగావాట్లుగా ఉన్న స్థాపిత విద్యుత్‌ సామర్థ్యాన్ని కేసీఆర్‌ పదేళ్ల పాలనలో 19,472 మెగావాట్లకు పెంచారని తెలిపారు. 400 కేవీ సబ్‌స్టేషన్లను 6 నుంచి 28కు, 220 కేవీ సబ్‌స్టేషన్లను 51 నుంచి 103కు పెంచి దాదాపు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందించామని చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్న సమయంలో థర్మల్‌ ప్లాంట్లలో బొగ్గు కొరతతో ఉత్పత్తి పడిపోతోందని, జల విద్యుత్‌ కేంద్రాలు సైతం నీటి లభ్యత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఎర్రబెల్లి అన్నారు. సింగరేణి నుంచి జెన్‌కోకు నాణ్యమైన బొగ్గు బదులు జి-13, జి-14 గ్రేడ్‌ నాసిరకం బొగ్గు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. నాసిరకం బొగ్గు వినియోగంతో విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం తగ్గి రూ.2,900 కోట్ల ప్రజాధనం నష్టపోయిందన్నారు.

సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.52 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, బకాయిలు చెల్లించకపోవడంతో సంస్థ ఇబ్బందుల్లోకి వెళ్లిందని చెప్పారు. 2023-24లో 70 మిలియన్‌ టన్నులుగా ఉన్న సింగరేణి బొగ్గు ఉత్పత్తి 2025-26లో 58 మిలియన్‌ టన్నులకు పడిపోయిందని తెలిపారు. కొత్త మైనింగ్‌ అనుమతులు తీసుకోకపోవడం, కార్మికులకు మూడేళ్లుగా భద్రతా కిట్లు, కనీసం బూట్లు, సాక్స్‌లు, డ్రిల్లింగ్‌ బిట్లు కూడా ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కేసీఆర్‌ హయాంలో సింగరేణి విద్యుత్‌ కేంద్రం సుమారు 91 శాతం పీఎల్‌ఎఫ్‌తో పనిచేసిందని గుర్తుచేశారు.

కేటీపీపీలో ఒసీ-1, ఒసీ-2, ఒసీ-3 ఉండగా ఒసీ-2, ఒసీ-3 ప్రస్తుతం పనిచేస్తున్నాయని, వాటిలో బొగ్గు నిల్వలు పూర్తయ్యాయని ఎర్రబెల్లి తెలిపారు. రోజుకు 5 వేల టన్నుల బొగ్గు రావాల్సి ఉండగా 2 వేల టన్నులు కూడా రావడం లేదన్నారు. గడ్డిగానిపల్లి గ్రామంలో భూసేకరణ జరగక ఓపెన్‌కాస్ట్‌ విస్తరణ ఆగిపోయిందని చెప్పారు. బొగ్గు సరఫరా లేక కేటీపీపీ రెండు యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తి తగ్గిపోయిందన్నారు. స్టేజ్‌-1లో 500 మెగావాట్లు, స్టేజ్‌-2లో 600 మెగావాట్ల ఉత్పత్తి జరగాల్సి ఉండగా ప్రస్తుతం రోజుకు 600 మెగావాట్లు కూడా ఉత్పత్తి కావడం లేదని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులకు ఆరు గంటలకు మించి కరెంట్‌ సరఫరా కావడం లేదని, అయినా ప్రభుత్వం 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నామని చెబుతోందని ఎర్రబెల్లి విమర్శించారు. నిజంగా 24 గంటల కరెంట్‌ ఇస్తే సబ్‌స్టేషన్ల వద్ద రైతుల ధర్నాలు, రాస్తారోకోలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. విద్యుత్‌ కోతల ప్రభావం వ్యవసాయానికే పరిమితం కాలేదని, పరిశ్రమలు కూడా ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. కొంతమంది పారిశ్రామికవేత్తలు తమ విద్యుత్‌ అవసరాల్లో సుమారు 30 శాతం జనరేటర్ల ద్వారా సమకూర్చుకుంటున్నారని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలోనూ రైతులు విద్యుత్‌ సమస్యపై రోడ్డెక్కినా ప్రభుత్వానికి సిగ్గు అనిపించడం లేదా అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. విద్యుత్‌ వ్యవస్థ గాడి తప్పడానికి కారణమేంటో రేవంత్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనా వైఫల్యం, చేతకానితనం, కమిషన్లు, అవినీతి వల్లే విద్యుత్‌ సంక్షోభం ఏర్పడిందని ఆరోపించారు.

రాష్ట్రంలోని థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు, సింగరేణి ప్రధాన కార్యాలయాలను సందర్శించి క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకునేందుకే బీఆర్‌ఎస్‌ నేతలు పర్యటిస్తున్నారని తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన విద్యుత్‌ మౌలిక వసతులను సక్రమంగా నిర్వహించకుండా వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. సింగరేణికి రావాల్సిన రూ.52 వేల కోట్ల బకాయిలను చెల్లించి, కేటీపీపీకి అవసరమైన బొగ్గును సరఫరా చేయాలని, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించి పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ తరఫున డిమాండ్‌ చేశారు.