ఎన్టీఆర్ నుంచే పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్
ఈటలే నా రాజకీయ గురువు
చదువుకున్నవాళ్లు రాజకీయాల్లోకి రావాలి
ఎంసెట్ ర్యాంకు ఓ సినిమా కథ..
సీటు రాలేదని ఫిక్స్.. పేపర్లో నెంబర్..
వైద్యంతో గౌరవం.. ఐఎంఏలో గుర్తింపు
నాడి పట్టుకునే డాక్టర్ కరువయ్యాడు
‘యాకయ్య మిత్రుడే కాదు.. నా ఆత్మ’
బీసీల్లో చైతన్యం రావాలి..
చదువుతోనే సామాజిక ఎదుగుదల
హక్కుల కోసం ఉద్యమించాలి
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, పరకాల నియోజకవర్గ ఇన్ చార్జి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్‌రావు
డిజిటల్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్
స్పాట్ వాయిస్, ప్రధాన ప్రతినిధి : టీచర్ కొడుకుగా పుట్టి.. తండ్రి కోరిక మేరకు డాక్టర్‌గా మారి.. ఎంబీబీఎస్‌లో కుల వివక్షను ఎదుర్కొని.. ఆ అనుభవాన్నే కసిగా మార్చుకుని వైద్య రంగంలో ఎదిగిన పగడాల కాళీ ప్రసాద్ రావు.. వరంగలో గార్డియన్ ఆస్పత్రి నిర్మాణం నుంచి ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయి వరకు సాగిన తన ప్రయాణాన్ని ఇప్పుడు రాజకీయాల వైపు మళ్లించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, పరకాల నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఆయన.. బాల్యం, చదువు, వైద్య వృత్తి, బీసీల పరిస్థితి, ఈటల రాజేందర్‌తో అనుబంధం, పరకాలతో తన బంధం, రాజకీయాల్లో తన ఆలోచనలపై డిజిటల్ మీడియా ప్రతినిధులతో చేసిన చిట్‌చాట్‌లో మనసు విప్పారు.
డాక్టర్ మా నాన్న కోరిక
మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక. మా అమ్మానాన్న పగడాల వెంకటనర్సయ్య-వజ్రమ్మ. నాకు తమ్ముడు, చెల్లి ఉన్నారు. మా నాన్న టీచర్. ఆయన ట్రాన్స్ఫర్ అయిన చోటికల్లా వెళ్లాల్సి వచ్చేది. టెన్త్ వరకు గ్రామాల్లోనే చదువు అయింది. టెన్త్ చిట్యాలలో సాగింది. ఇంటర్ పరకాలలో చదివిన. మా నాన్నకు నన్ను డాక్టర్ చేయాలనే కోరిక ఉండేది. అందుకే చదువంతా నిర్బంధంగా సాగింది. నా తోటి పిల్లలంతా ఆడుకోవడానికి వెళ్తే నేను మాత్రం బుక్ ముందువేసుకొని కూసునేటోడిని. మా నాన్న ఎప్పుడైనా ఊరికి పోతే సంబురపడేది. మా అమ్మను బతిమిలాడుకుని ఆటకు పోయేది.
దొరల హుందా చూసి చదువైపు..
చదువుమీద కాయిస్సు మా ఊరి దొరలను చూసి వచ్చింది. రిటైర్డ్ జడ్జి రఘునందన్ రావు ఉండేవాడు. వాళ్లు ఊరికి వచ్చినప్పుడు ఆయనను, వాళ్ల పిల్లలను చూసేందుకు ఊరంతా పోయేది. వాళ్ల డ్రెస్సింగ్, ఇంగ్లిష్ మాటలు అన్నీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసేవి. అప్పుడే అనుకున్న.. నేను కూడా మంచిగా చదువుకుంటే ఈ స్థాయికి ఎదగవచ్చని. అప్పటి నుంచి చదువుపై ఇంట్రెస్ట్ పెంచుకున్న.
మూడో ప్రయత్నంలో డాక్టర్ సీటు..
‘‘ఎంసెట్ రెండుసార్లు రాసిన. మూడో అటెంప్ట్‌లో వచ్చింది. కేఎంసీలో ఎంబీబీఎస్, పీజీ పూర్తి చేసిన. ముందు రెండేళ్లు ఏటూరునాగారంలో పని చేసిన తర్వాత 12 ఏళ్లు ఎంజీఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశాను. 1992లో పెళ్లి అయింది. నా భార్య స్వర్ణలత. ఆమె ఎంబీబీఎస్, డీజీఓ. నా క్యారెక్టర్, మా నాన్న టీచర్ అని మా మామ ఆకుల ఆనందం వెతికి మరి పట్టుకొని పెండ్లి చేసిండ్లు’’ అని కాళీ ప్రసాద్ రావు నవ్వుతూ చెప్పారు.
ఎంబీబీఎస్‌లోనే కుల వివక్ష తెలిసింది..
‘‘నాకు ఇంటర్ వరకు కులం అంటే తెలిసేది కాదు. నేను ఇంటర్లో నలుగురు మిత్రులతో రూం తీసుకొని ఉండేవాళ్లం. ఎప్పుడైతే ఎంబీబీఎస్‌లో చేరానో అప్పుడు కులం గురించి తెలుసుకోవాల్సి వచ్చింది. ఉన్నత విద్యలో కుల వివక్ష ఉంటుందని అప్పుడు తెలుసుకున్న. నేను ఎంబీబీఎస్‌లో కుల వివక్షతో ఎంతో బాధపడిన. నేను కొంతమందికి నమస్తే పెడితే పెట్టేవారు కాదు.. పట్టించుకునేవారు కాదు. ఎందుకా అని నిత్యం ఆలోచించేవాడిని. డ్రెసింగ్ వల్లనా అని అనుకునేది. నాకు రెండే బట్టల జతలు ఉండేది. కుల వివక్ష గురించి తెలుసుకోవడానికి ఏడాదిపైనే పట్టింది. అగ్రవర్ణాల విద్యార్థులు గ్రూపులుగా ఉంటారని తెలిసింది. వాళ్లకు వాళ్లకు నమస్తేలు పెట్టుకోవడం, సహకరించుకోవడం, పార్టీలు చేసుకోవడం ఉండేది.’’
ఆ వివక్షే నాలో కసి పెంచింది..
‘‘ఎంబీబీఎస్‌లో ఎదురైన వివక్ష.. బీసీలపై వారి నిర్లక్ష్యం నుంచి చదువుపై మరింత కసి పెరిగింది. అదే ఈరోజు ఆర్ వీఎం మెడికల్ కాలేజీ చైర్మన్ వరకు ఎదిగేలా చేసింది.
నేను నా మిత్రుడు రాజబోయిన యాకయ్య.. మిత్రుడే కాదు.. నా ఆత్మ కూడా. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన యాకయ్య నేను కష్టపడ్డాం. అన్నింట్లో నాకు ఆయన.. యాకయ్య నేను అండగా ఉండేవాళ్లం. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీలు మెడికల్ కాలేజీ చైర్మన్లుగా ఉన్న కాలేజీ ఆర్ వీఎం. మేము మాత్రమే అనుకుంటున్న. యాకయ్య నాకు దొరకడం అదృష్టంగా భావిస్తా.’’
ఉదయం 6 నుంచి రాత్రి 12 వరకు..
‘‘డాక్టర్ వృత్తిలో ఎంతగానో కష్టపడ్డా. జయ, రోహిణి హాస్పిటల్స్ లో పని చేసిన. ప్రతీ రోజు ఒక మండలం వెళ్లి వైద్యం అందించేవాడిని. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పని. ఒకటి కాదు.. రెండు కాదు.. పదేళ్లు కష్టపడ్డా. ఒక్కోసారి పిల్లలను చూసే టైం ఉండేది కాదు. లాస్ట్ స్టేజీలో ఉన్న ఎంతోమందిని కాపాడా. ప్రాణాలు నిలబెట్టినప్పుడు ఫీలింగ్ వేరే ఉంటుంది. నాకు రఘురామ్, సత్యమూర్తి సార్ అంటే అపారమైన గౌరవం. వాళ్లు నాకు విలువలు నేర్పారు.’’
నాడి పట్టుకునే డాక్టర్ కరువయ్యాడు
ప్రస్తుత వైద్యం ఆందోళనకరంగా మారింది. డాక్టర్లు పేషెంట్లకు దూరం అయ్యారు. మిషన్లు, డబ్బులు దగ్గరయ్యాయి. నాడి పట్టుకునే డాక్టర్ లేకుండా పోయాడు. అందరిలో మార్పు వచ్చింది. టెస్టులు చేయకపోతే రోగులు అయ్యో అని ఆందోళన చెందుతున్నారు. ఇంతకుముందు నాడి పట్టుకొని.. రోగి వివరాలు అడిగి సమస్య తెలుసుకొని.. వ్యాధిపై అంచనాకు వచ్చి ట్రీట్మెంట్ చేసేవాళ్లు. ప్రస్తుతం కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ పెరిగింది. ఫ్యూచర్లో డాక్టర్స్ వ్యవస్థ మరింత పతనం స్థాయికి పోయే ప్రమాదం ఉంది.
నన్ను చూసి నవ్విన చోటే ఆస్పత్రి కట్టిన..
2008లో గార్డియన్ ఆస్పత్రికి స్టోన్ పడింది. అప్పుడు ములుగు రోడ్డులో ఆస్పత్రి కడుతుంటే అందరూ నవ్వుకున్నారు. గీడ ఏం డెవలప్మెంట్ ఉంటుందని నన్ను డిసప్పాయింట్ చేశారు. కానీ నాకు ఉన్న విజన్‌తో నేను ఆస్పత్రి కట్టిన. నేడు సక్సెస్ అయ్యా. 2010లో నా ఉద్యోగానికి రాజీనామా చేసి గార్డియన్ ఆస్పత్రి ప్రారంభించాను. నేను ప్రారంభించినప్పుడు ఈ ఆస్పత్రి చాలా పెద్దది. ఇప్పుడు మిడిల్‌కు వచ్చింది. నేను పేషెంట్లకు 24/7 అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఆస్పత్రి పై ఫ్లోర్‌లోనే రెసిడెంట్ ఏర్పాటు చేసుకున్న. నా ఉద్యోగ ప్రస్థానం నుంచి ఇప్పటి వరకు ప్రతీ రోజు రాత్రి 11 గంటల వరకు పేషెంట్ల వద్దకు వెళ్తా. వారితో మాట్లాడి సమస్య తెలుసుకుంట.
టాప్ సర్జరీగా..
ట్రామా సర్జరీల్లో తెలంగాణలో టాప్‌లో నేను ఉంటా. నేను ఎవరిపై ఆధారపడ.. ప్రజలతో సత్సంబంధాలు, ప్రజాప్రతినిధులతో మంచిగా ఉంటాను. ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామ అధ్యక్షులు.. ఇలా అందరూ వాళ్ల గ్రామస్తులను నా ఆస్పత్రికి పంపుతారు. బిల్లుల్లోనూ లిబరల్గా ఉంటా. అందుకే నా దగ్గరికి పంపుతరు. నేను కాకులను కొట్టి గద్దలకు వెయ్య. ఏది ఉన్నా పేదోళ్లకు న్యాయం జరగాలే.. అదే నా సిద్ధాంతం.’’
ఐఎంఏలోనూ బీసీలకు దారి సుగమం చేసిన..
డాక్టర్ వృత్తితో ఎంతో గౌరవాన్ని సంపాదించుకున్న. 1997లో ఐఎంఏ మెంబర్షిప్ తీసుకున్న. ఐఎంఏ నుంచి ఏ మీటింగ్ పెట్టినా హాజరు అయ్యేవాడిని. 2023లో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన. ఐఎంఏలో కీలకంగా ఉంటా. ఐఎంఏలో బీసీలు అధ్యక్షుడు కావాలంటే కష్టం ఉండేది. అలాంటిది సుగమం చేసిన.’’
వైద్య వారసత్వం పిల్లలకు
నా పెద్ద కూతురు తేజస్వీ ఎంఎస్ ఆప్తల్మాలజీ. అల్లుడు అనురాగ్ ఆర్థోపెడిక్. చిన్న కూతురు యశస్వి ఎండీ జనరల్. రానున్న కొద్ది రోజుల్లోనే హాస్పిటల్‌ను మరింత డెవలప్ చేసి వాళ్లకు అప్పగిస్తా.’’ అప్పుడు పూర్తిగా రాజకీయాల వైపు వెళ్తా.
ఎన్టీఆర్‌తో మొదలైన రాజకీయ ఆసక్తి
ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాకు రాజకీయాలంటే మరింత ఇష్టం పెరిగింది. 1983లో ఎన్టీఆర్ వస్తున్నాడని తెలిసి నేను నా ఫ్రెండ్స్‌తో కలిసి రేపాక నుంచి సైకిళ్లపై పరకాలకు వచ్చినం. ఒక్కో సైకిల్‌పై ముగ్గురం వచ్చినం. టీడీపీ అంటే అభిమానం ఉండేది. యువరక్తం కదా.. ఆ పార్టీ నాయకులతో తిరిగేది. మా తాత కాంగ్రెస్. నేను వాళ్లతో తిరుగుతుంటే తిట్టేవాడు. ‘మీ నాన్నకు ఉద్యోగం పెట్టించింది కాంగ్రెస్ రా’ అని చెప్పేవాడు. 2004-14 వరకు మున్నూరుకాపు సంఘం ప్రధాన కార్యదర్శిగా పని చేశాను. కులం మద్దతు పుష్కలంగా ఉంటుంది.’’
బీసీల ఎదుగుదలకు విద్యే మార్గం
‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నతంగా మారాలంటే విద్య తప్ప మరో మార్గం లేదు. బీసీలు ఎదగాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జ్ఞానోదయం కావాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్‌రావు అన్నారు. హక్కుల కోసం బీసీలు ఉద్యమించాలని, అదే సమయంలో అగ్రవర్ణాలను దూరం చేయకుండా తమ సమస్యలను వివరించి వారిని కూడా భాగస్వాములను చేసుకుంటేనే సామాజిక మార్పు సాధ్యమవుతుందని చెప్పారు.
యాకయ్యతోనే ఈటల పరిచయం
యాకయ్య ముదిరాజ్ సామాజికవర్గానికి చెందినవాడు. ఆయన వల్లే నాకు ఈటల రాజేందర్‌తో పరిచయం ఏర్పడింది. ఆయన సహకారంతో మెడికల్ కాలేజీ ప్రారంభించిన. కాలేజీ ప్రారంభానికి కేసీఆర్ వచ్చాడు. నా రాజకీయ గురువు ఈటల. ఎప్పటికైనా ఆయన వెంట నా నడక ఉంటుంది. నాకు పరకాల టికెట్ రావడం వెనక ఆయనే ఉన్నారు. నేను ఆయన్ను టికెట్ కోసం ఫోర్స్ చేయలేదు. ఆయనే కాళీ ప్రసాద్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఈటల రాజేందర్ పోటీ చేస్తడని ఒక కార్యక్రమంలో చెప్పిన. అప్పుడు అందరూ అవాక్కయ్యారు.’’
ఎన్నికల తర్వాత కూడా పరకాలతోనే..
ఈటల రాజేందర్ ప్రోత్సాహంతోనే నేను పని చేస్తున్న. పరకాల నియోజకవర్గ ప్రజల కోసం పని చేస్తున్న. ఓటర్లు చాలా మంది నాపై నమ్మకంతో ఓటు వేశారు. ఎన్నికల్లో ఓడిపోయానని బాధపడలేదు. అయితే బీసీలు అంతమంది ఉన్నా.. బీసీ బిడ్డను నన్ను కాదని అగ్రవర్ణాలను ఆదరించడం బాధగా అనిపించింది. అయినా నేను నియోజకవర్గంతోనే ఉన్నా. రిజల్ట్ మరుసటి రోజు నుంచే పరకాల ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న. ప్రజలకు సైతం అర్థమైంది. నాకు వస్తున్న ఆదరణ.. ప్రజల మాటలు వింటుంటే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఆశీర్వదిస్తారనే నమ్మకం పెరిగింది. గత ఎన్నికల్లోనూ బీసీగా నన్ను గుర్తించారు.’’
చిన్నప్పటి నుంచే బుర్రలో పాలిటిక్స్
చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఆసక్తే. అందుకేనేమో నా బుర్రలో పాలిటిక్స్.. పాలిటిక్స్ అని తిరుగుతుంటుంది. రాజకీయాలపై ఆసక్తితోనే 2004లో 50 మంది డాక్టర్లతో కలిసి వినోద్‌కుమార్ సాయంతో కేసీఆర్‌ను కలసి హనుమకొండ టికెట్ అడిగిన. అయితే పొత్తులో బీజేపీకి పోవడంతో మిస్ అయింది. 2005 కార్పొరేషన్ హయాంలోనూ మేయర్ చాన్స్ కోసం ఆఫర్ వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి ఆఫర్ వచ్చింది. పరకాలలో బీసీగా కాంగ్రెస్ నుంచి నన్ను బరిలో దింపాలని ప్రయత్నాలు చేశారు. కానీ నా ప్రయాణం ఈటలతోనే అని చెప్పిన.’’
పాలిటిక్స్ ఓ కోర్సులా చదువుతున్నా
మూడేళ్లుగా పాలిటిక్స్‌ను కూడా ఒక కోర్సులా చదువుతున్నానని కాళీప్రసాద్ రావు అన్నారు. కసితో ముందుకు పోతున్న. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆదుకుంటున్న. మిగతా వాళ్లు వదిలేశారు. ఎన్నికల్లో నేను ఇచ్చిన హామీ మేరకు నా ఆస్పత్రికి వచ్చే వారికి బిల్లులు కూడా తగ్గిస్తున్న. నేను రాజకీయాల్లోకి డబ్బు కోసం రాలేదు. డబ్బే కావాలంటే నాకు వైద్య రంగంలోనే సంపాదించుకోగలను. ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకు వచ్చింది. రాజకీయాల్లోకి చదువుకున్న వారు రావాలి. ప్రస్తుతం రాజకీయాలంటే డబ్బు పెట్టాలి. సంపాదించుకోవడం అనే ది మాత్రమే ఉంది. అవి పోవాలి. రాజకీయాల్లో బాస్ ఉండాలి. లేకుంటే రాజకీయాలు చేయొద్దు. డీలిమిటేషన్‌పై వస్తున్న ప్రచారం అంతా ఊహాజనితమేనని కాళీ ప్రసాద్‌రావు అన్నారు. డీలిమిటేషన్‌కు సంబంధించిన అసలు అంశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తప్ప ఎవరికీ తెలియవని వ్యాఖ్యానించారు. అధికారికంగా నిర్ణయం వెలువడే వరకు డీలిమిటేషన్‌పై వస్తున్న ప్రచారాలను నమ్మాల్సిన అవసరం లేదన్నారు.
మెడిసిన్ సీటు ఓ సినిమా కథ..
మెడిసిన్ సీటు మూడో ప్రయత్నంలో వచ్చింది. రెండుసార్లు రాలేదని మూడోసారి రాయనని అన్న. అయితే మా అమ్మ వజ్రమ్మ బతిమిలాడి ఎంసెట్ రాయించింది. అయితే రెండు సార్లు రాస్తే రానిది మూడోసారి వస్తుందా అనే భావన ఉండేది. అప్పట్లో రిజల్ట్ పేపర్ లో వచ్చేది. అప్పుడు నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో బంద్ లు ఉండేది. నా రిజల్ట్ అప్పుడు అదే పరిస్థితి. నేను ఉస్మానియా మెడికల్ కాలేజీ పరిధిలో రాసిన. అందులో నా పేరు లేదు. నీకు సీటు రాలేదని చెప్పారు. ఏ మాత్రం ఫీల్ లేకుండా నేను దోస్తులతో కలిసి పరకాలలో ఛాయ్ తాగేందుకు వెళ్తుంటే ఈనాడు పేపర్ కనిపించింది. ఓసారి రిజల్ట్ చూసుకుందామని అనుకోకుండా పేపర్ తిప్పిన. ఉస్మానియ మెడికల్ కాలేజీ సీట్లలో నా నెంబర్ రాలే. అప్పుడే ఫిక్స్ అయ్యా అయితే ఎందుకో.. కాకతీయ మెడికల్ కాలేజీ లిస్ట్ చూస్తే అందులో నా నెంబర్ లానే అనిపించింది. మళ్లీ జాగ్రత్తగా చూసి.. డౌట్ కొద్ది రూంకు వెళ్లి హాల్ టికెట్ తెచ్చుకొని మరి చూసిన. ఆ నెంబర్ నాదే. నమ్మశక్యం కాక దోస్తులను కూడా చూడమని చెప్పిన. సీటు వచ్చిందని తెలిసాకా.. ఆ ఆనందానికి అవధుల్లేవ్.