SPOT VOICE
Newspaper Banner
Date : 13 September 2026, 4:37 pm Posted By : SPOT VOICE MEDIA

ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చినా.. సురేఖ వెళ్లలేదు

పదవులు ఉంటాయి.. పోతాయి.. మాట తప్పేది లేదు: కొండా మురళి

స్పాట్ వాయిస్ ,వరంగల్,: ఢిల్లీ నుంచి పలుమార్లు ఫోన్లు వచ్చినా కొండా సురేఖ అధిష్ఠానం వద్దకు వెళ్లలేదని ఆమె భర్త, కాంగ్రెస్‌ నేత కొండా మురళి అన్నారు. ఒక మాటకు కట్టుబడి ప్రజలకు సేవ చేయాలన్నదే తమ నిర్ణయమని స్పష్టం చేశారు. ఆదివారం వరంగల్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధిష్ఠానం సురేఖను క్షమాపణ కోరుతూ పేపర్‌పై రాయమన్నా ఆమె రాయలేదని వెల్లడించారు. పదవులు ఉంటే ఉంటాయని, పోతే పోతాయని.. కానీ మాట తప్పే ప్రసక్తి లేదన్నారు.

ఢిల్లీ నుంచి పిలుపు నిజమే..

సురేఖకు పదవులు ఇవ్వడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారని, ఢిల్లీ రావాలని పలువురు ఫోన్ చేసిన మాట వాస్తవమేనని మురళి తెలిపారు. అయినప్పటికీ సురేఖ వెళ్లలేదన్నారు. ‘‘ప్రజలకు సేవ చేద్దాం.. పదవి ఉంటే ఉంటుంది.. పోతే పోతది’’ అనే వైఖరితో ఆమె ఉన్నారని చెప్పారు. పరకాల బాధ్యతలను తన కుమార్తె సుస్మిత చూసుకుంటుందని, వరంగల్ బాధ్యతలను తాము చూసుకుంటామని గతంలోనే నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం

కొండా సురేఖను గెలిపించడంలో రాహుల్‌గాంధీ కీలక పాత్ర పోషించారని మురళి పేర్కొన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడమే కొండా దంపతుల లక్ష్యమన్నారు. కాంగ్రెస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదని, పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. కృతజ్ఞత అనేది కొండా రక్తంలోనే ఉందన్నారు. బీసీల కోసం ముందుకు వచ్చే నాయకులు లేరని వ్యాఖ్యానించారు.

నా ‘కారు రంగు’ ముస్లింలకు చిహ్నం

తన కారు రంగు ప్రత్యేకమైనదని, దేశంలో మరెవరి కారుకు ఆ రంగు ఉండదని మురళి అన్నారు. అది ముస్లింలకు చిహ్నంగా పేర్కొన్నారు. తన శరీరంలో ఇప్పటికీ నాలుగు బుల్లెట్లు ఉన్నాయని, కార్యకర్తల ఆశీస్సులే తనను బతికిస్తున్నాయని అన్నారు. పార్టీలో ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడవద్దని కార్యకర్తలకు సూచించారు.

తూర్పులో 24 మంది కార్పొరేటర్లే లక్ష్యం

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 24 మంది కార్పొరేటర్లను గెలిపిస్తానని మురళి ప్రకటించారు. ఈ ప్రాంత బాధ్యతలను నవీన్‌రాజ్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపారు. కష్టపడి పనిచేసే వారికే, గెలిచే సామర్థ్యం ఉన్న వారికి కార్పొరేటర్‌ టికెట్లు దక్కుతాయని స్పష్టం చేశారు. తనకు, తన కుమార్తె సుస్మితకు సంబంధం లేదని.. తనను నమ్ముకుని ఎంతోమంది నాయకులు ఉన్నారని అన్నారు.

కబ్జాలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

తాను కబ్జాలు చేసినట్లు ఎవరైనా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొండా మురళి సవాల్ చేశారు. తనపై ఉన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ విషయాలన్నీ సీఎం రేవంత్‌రెడ్డికి తెలుసని అన్నారు. అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగుతామని తెలిపారు.

కార్యకర్తలే బలం

కార్యకర్తల కోసం అవసరమైతే మరో పది ఎకరాల భూమినైనా అమ్ముతానని మురళి అన్నారు. కార్యకర్తలే తన బలమని పేర్కొన్నారు. ఎంతకాలం బతికామన్నది కాదని.. ఎలా బతికామన్నదే ముఖ్యమన్నారు. కొండా మురళి మాటంటే మాటేనని స్పష్టం చేస్తూ, పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.