SPOT VOICE
Newspaper Banner
Date : 30 August 2026, 4:28 pm Posted By : SPOT VOICE MEDIA

ఎమ్మెల్యే అల్లుడి పెత్తనం ఏంటి..? అసలు పశ్చిమ లో ఎమ్మెల్యే ఎవరు..?

ఎమ్మెల్యే అల్లుడి ఒత్తిడితోనే హిందూ యువకులపై వేధింపులు

హనుమకొండ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి..

అర్ధరాత్రి అరెస్టులు రాక్షస పాలనకు నిదర్శనం

స్పాట్ వాయిస్ ,హనుమకొండ: ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ పండుగలను స్వేచ్ఛగా జరుపుకునే రాజ్యాంగ హక్కు ఉందని, అయితే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో హిందూ పండుగల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంతో పాటు అర్ధరాత్రి వేళ యువకులను అరెస్టు చేయడం దారుణమని బీజేపీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పోటీ చేసిన అభ్యర్థి రావు పద్మ రెడ్డి ఆరోపించారు.

 

తండ్రి దొరకకపోతే కొడుకును, కొడుకు దొరకకపోతే తండ్రిని అరెస్టు చేయడం ఏ రకమైన పాలన అని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యేను తాము గౌరవిస్తామని, అయితే ఎమ్మెల్యే అల్లుడి పెత్తనం ఏంటని నిలదీశారు. ఎమ్మెల్యే అల్లుడు చెప్పారని హనుమకొండ సీఐ ఒక పక్షానికే కొమ్ముకాస్తూ హిందూ యువకులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే అల్లుడికి వత్తాసు పలుకుతున్న సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

హిందూ యువకులను అక్రమంగా అరెస్టు చేశారనే సమాచారం తెలుసుకున్న రావు పద్మ రెడ్డి, బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్‌తో కలిసి హనుమకొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. సీఐని ప్రశ్నించి పోలీసుల వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. బన్నీ, బంటి, రాహుల్‌ను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 

రాజకీయాలకు అతీతంగా ప్రతి హిందువు హక్కుల కోసం బీజేపీ పోరాడుతుందని రావు పద్మ రెడ్డి స్పష్టం చేశారు. పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునే హక్కును హరించే చర్యలను సహించబోమన్నారు. ప్రశాంతంగా ఉండే వరంగల్ వాతావరణాన్ని దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని, నిరంకుశ చర్యలు కొనసాగితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.