స్పాట్ వాయిస్, నర్సంపేట: నర్సంపేట పరిధిలోని ముతోజీపేట జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా ముదిగొండ నుంచి స్కార్పియో వాహనంలో ఏడుగురు మేడారం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ముతోజీపేట సమీపంలో వాహనం అధిక వేగంతో వెళ్తుండగా అకస్మాత్తుగా రహదారిపైకి వచ్చిన ఎద్దును ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోవడంతో స్వార్పియో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మిగతా ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.