SPOT VOICE
Newspaper Banner
Date : 22 August 2026, 8:21 am Posted By : SPOT VOICE MEDIA

ఎకరా రూ.264 కోట్లు

ఓల్డ్ రికార్డ్స్ బ్రేక్​
రాయదుర్గం పాన్‌మక్తాలోని 5.25 ఎకరాలకు టీజీఐఐసీ వేలం
మూడు నెలల్లోనే భారీగా పెరిగిన ధర
స్పాట్ వాయిస్, డెస్క్ : నగరంలోని ప్రముఖ ఐటీ హబ్‌ రాయదుర్గంలో భూముల ధరలు మరోసారి రికార్డు సృష్టించాయి. పాన్‌మక్తా ప్రాంతంలోని సర్వే నంబర్‌ 83/1లోని 5.25 ఎకరాల భూమికి టీజీఐఐసీ నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలంలో ఎకరా రూ.264 కోట్లకు అమ్ముడైంది. కాగా వేలంలో ఎంఎస్‌ఎన్‌ రియాల్టీ సంస్థ మొత్తం 5.25 ఎకరాలను దక్కించుకోగా, టీజీఐఐసీకి సుమారు రూ.1,381 కోట్ల ఆదాయం లభించింది. ఈ వేలంలో పలు స్థిరాస్తి సంస్థలు పోటీపడ్డాయి. రూ.175 కోట్ల ప్రారంభ ధరతో బిడ్డింగ్‌ ప్రారంభం కాగా, కనీసం రూ.కోటి చొప్పున పెంచుతూ సంస్థలు పోటీగా బిడ్లు దాఖలు చేశాయి. చివరకు ఎంఎస్‌ఎన్‌ రియాల్టీ ఎకరాకు రూ.264 కోట్ల అత్యధిక బిడ్‌ వేసి భూమిని సొంతం చేసుకుంది.

మూడు నెలల్లో రూ.27 కోట్ల పెరుగుదల:
ఇదే సర్వే నంబర్‌లో మే నెలలో నిర్వహించిన వేలంలో ఎకరం రూ.237 కోట్లకు అమ్ముడైంది. తాజాగా అదే ప్రాంతంలో ఎకరం ధర రూ.264 కోట్లకు చేరడంతో కేవలం మూడు నెలల్లోనే రూ.27 కోట్ల పెరుగుదల నమోదైంది. దీంతో టీజీఐఐసీ భూముల వేలంలో ఇది కొత్త రికార్డుగా నిలిచింది.

భారీ పెట్టుబడులు…
రాయదుర్గం ఐటీ కారిడార్‌లో అంతర్జాతీయ కంపెనీలు, గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీలు), డేటా సెంటర్లు, కార్పొరేట్‌ కార్యాలయాలు భారీగా ఏర్పాటవుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత, ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే తక్కువ నిర్వహణ వ్యయం వంటి అంశాలు ఈ ప్రాంతంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. దీంతో రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు భూముల కొనుగోలుకు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. టీజీఐఐసీ వేలం ద్వారా విక్రయించే భూములకు వివాదాలు తక్కువగా ఉంటాయనే నమ్మకంతో సంస్థలు పోటీ పడుతున్నాయి. ఐటీ, వాణిజ్య కార్యకలాపాలు మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో రాయదుర్గం భూములకు భవిష్యత్తులోనూ భారీ డిమాండ్‌ కొనసాగే అవకాశముంది.