SPOT VOICE
Newspaper Banner
Date : 18 August 2026, 10:38 pm Posted By : SPOT VOICE MEDIA

బలవంతపు మత మార్పిడులకు అడ్డుకట్ట..

స్పాట్ వాయిస్, బ్యూరో : బలవంతపు, మోసపూరిత మత మార్పిడులను అడ్డుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది. ‘ద మహారాష్ట్ర ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ యాక్ట్, 2026’ ఆగస్టు 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది. బలవంతం, తప్పుడు హామీలు, మోసం లేదా అనుచిత మార్గాల ద్వారా మతం మార్చే ప్రయత్నాలను ఈ చట్టం నేరంగా పరిగణిస్తుంది. నేరం రుజువైతే గరిష్టంగా 7 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. మైనర్లు, మానసిక సమస్యలు ఉన్నవారు, ఎస్సీ, ఎస్టీలను మతం మార్చిన కేసుల్లో కఠిన శిక్షలు ఉంటాయి. ఈ కేసులను నాన్‌ బెయిలబుల్‌గా పరిగణిస్తారు. స్వచ్ఛందంగా మతం మార్చుకునేవారు 60 రోజుల ముందుగా సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. అంతర్మత వివాహాలు, సంబంధాల విషయంలోనూ చట్టంలోని నిబంధనలు వర్తిస్తాయి. ముఖ్యంగా, చట్టవిరుద్ధంగా మత మార్పిడి జరిగితే పుట్టే పిల్లలకు తల్లి మతం వర్తించే నిబంధనను ప్రభుత్వం పొందుపరిచింది. ఈ చట్టాన్ని కొన్ని సంస్థలు వ్యతిరేకించగా, బలవంతపు మార్పిడులను నియంత్రించడానికే తీసుకొచ్చామని ప్రభుత్వం స్పష్టం చేసింది.