తెలంగాణ నుంచి ఒక్కరే ఒక్కరు..
యూట్యూబ్ ‘పంతులమ్మ’గా ఫేమస్..
వినూత్న బోధనతో విద్యార్థుల్లో ఆసక్తి పెంపు
దేశవ్యాప్తంగా 48 మంది ఎంపిక..
సెప్టెంబర్ 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం
స్పాట్ వాయిస్, బ్యూరో : తెలంగాణకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. 2026 సంవత్సరానికి కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు తెలంగాణ నుంచి ఆమె ఒక్కరే ఎంపికయ్యారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (బాలికలు)లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న భవాని.. వినూత్న బోధనా పద్ధతులతో విద్యార్థుల్లో అభ్యసన ఆసక్తిని పెంచుతూ ప్రత్యేక గుర్తింపు పొందారు.
యూట్యూబ్ ‘పంతులమ్మ’గా ప్రత్యేక గుర్తింపు
భవాని బోధనా విధానం తరగతి గదికే పరిమితం కాలేదు. యూట్యూబ్ ద్వారా పాఠాలను అందిస్తూ ‘యూట్యూబ్ పంతులమ్మ’గా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా గణితాన్ని విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వినూత్న పద్ధతుల్లో బోధించడం ఆమె ప్రత్యేకత. క్లిష్టమైన గణిత అంశాలను సైతం సరళమైన ఉదాహరణలు, ఆసక్తికరమైన బోధనా విధానాలతో వివరించడం ద్వారా విద్యార్థుల్లో సబ్జెక్టుపై భయాన్ని తొలగించేందుకు కృషి చేస్తున్నారు.
2025లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంతో పాటు బాలికల విద్యను ప్రోత్సహించడంలోనూ భవాని కీలక పాత్ర పోషిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచేలా కృషి చేస్తున్నారు. ఆమె బోధనా సేవలు, విద్యార్థుల పట్ల అంకితభావం, పాఠశాల అభివృద్ధికి చేస్తున్న కృషికి గుర్తింపుగా 2025లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు.
దేశవ్యాప్తంగా 48 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు
పాఠశాల విద్య, అక్షరాస్యత రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 48 మంది ఉపాధ్యాయులను జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు–2026కు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరిలో 26 మంది పురుషులు, 22 మంది మహిళలు ఉన్నారు. సెప్టెంబర్ 5న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎంపికైన 48 మంది ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.

