SPOT VOICE
Newspaper Banner
Date : 18 August 2026, 6:21 pm Posted By : SPOT VOICE MEDIA

ఎమ్మెల్యే బరిలో ఉంటా.. 

ఎమ్మెల్యే బరిలో ఉంటా..

రిజర్వేషన్‌ కలిసొస్తే నేను.. లేదంటే నా సతీమణి 

గ్రేటర్‌ వరంగల్‌ కాంగ్రెస్‌దే.. 

డిజిటల్ మీడియాతో డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి చిట్‌చాట్‌ 

స్పాట్ వాయిస్, ఓరుగల్లు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇనగాల పేరు కచ్చితంగా ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. రిజర్వేషన్‌ కలిసొస్తే తాను.. లేదంటే తన సతీమణి బరిలో ఉంటారని తెలిపారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని, మేయర్ గా బరిలో ఉండమన్నా ఉంటానంటూ డిజిటల్‌ మీడియాతో మంగళవారం నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన వెల్లడించారు.

0 నుంచి గెలుపు వరకు.. 

పరకాలలో కాంగ్రెస్‌ను 0 నుంచి గెలుపు దిశగా తీసుకెళ్లానని వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. 2014లో పోటీ చేసిన తర్వాత పదేళ్లపాటు కార్యకర్తల వెన్నంటి నిలిచానని, గ్రామగ్రామాన తిరిగి పార్టీని బలోపేతం చేశానన్నారు. ఉప ఎన్నికలో 5 వేల ఓట్లకు పరిమితమైన కాంగ్రెస్‌ను 2023లో గెలిపించే స్థాయికి తీసుకొచ్చామని చెప్పారు.

పదవుల కోసం పాకులాడలే 

తాను పదవుల కోసం ఎప్పుడూ పైరవీలు చేయలేదని తెలిపారు. “పార్టీలో నేను సేవకుడిని మాత్రమే. పార్టీ, ప్రజలకు సేవ చేయడమే ఇష్టం” అన్నారు. ఎన్నో అవకాశాలు వచ్చినా పార్టీ మారలేదని చెప్పారు. ఇనగాల చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పేదలకు సాయం చేయడం తనకు సంతృప్తినిస్తుందని తెలిపారు. ఎంజీఎం పిల్లల విభాగం వసతుల కోసం రూ.కోటి, పరకాల ప్రభుత్వ ఆస్పత్రికి రూ.50 లక్షలు అందించానన్నారు. కుడా చైర్మన్‌గా వచ్చిన జీతాన్ని కూడా పేదల సేవకే ఖర్చు చేశానని చెప్పారు.

48 గంటల దీక్షతో.. ఆర్డీవో డివిజన్‌ 

పరకాల రెవెన్యూ డివిజన్‌ కోసం 2016లో 48 గంటల నిరాహార దీక్ష చేపట్టానన్నారు. టెక్స్‌టైల్‌ పార్క్‌ భూ నిర్వాసితులకు రూ.10 లక్షల పరిహారం, 100 గజాల స్థలం వచ్చేలా పోరాడానని తెలిపారు.

ఆర్ఎస్‌ఎస్‌లా కాంగ్రెస్‌కు సైన్యం 

కాంగ్రెస్‌కు కూడా ఆర్ఎస్‌ఎస్‌ తరహాలో సుశిక్షితమైన కార్యకర్తల సైన్యం అవసరమని అన్నారు. హనుమకొండ జిల్లాలో 500 మంది కార్యకర్తలను తయారు చేస్తున్నామని, ఎన్నికల సమయంలో ఎక్కడైనా పార్టీ కోసం పనిచేసేలా వారిని సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

 

కార్యకర్తలే పార్టీకి బలం 

గ్రామస్థాయి కేడర్‌ను బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. ఈనెల 31లోగా కమిటీలను పూర్తి చేస్తామని, మహిళలు, జెన్‌జీ, జెన్‌ఆల్ఫాకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రతి గ్రామంలో జెండా పండుగ నిర్వహిస్తామని, దసరా నుంచి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. ప్రతి నెలా కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామన్నారు. “ఎన్నికల్లో గెలవాల్సింది వ్యక్తి కాదు.. పార్టీ” అన్న రాహుల్‌గాంధీ ఆలోచనను అమలు చేస్తామని చెప్పారు.

గ్రేటర్‌ కాంగ్రెస్‌దే 

గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కైవసం చేసుకోవడం ఖాయమని వెంకట్రామ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఓ సర్వేలో 46–48 డివిజన్లు వస్తున్నట్లు తేలిందన్నారు. డివిజన్‌, బూత్‌ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తామని తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికలకు మరికొంత సమయం ఉన్నందున కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే డివిజన్ల సంఖ్య మరింత పెరగనుంది.

ప్రోటోకాల్ లేకపోవడం వల్లే..

పరకాలలో ఈనెల 16న జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ పర్యటన అఫీషియల్ ప్రోగ్రాం. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభ జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు. ప్రభుత్వ కార్యక్రమం కావటం వల్ల నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న బహిరంగ సభకు హాజరు కాలేదు. పార్టీ కార్యక్రమం కాదనే నేను ఆ బహిరంగ సభకు దూరంగా ఉన్ననని చెప్పారు.

త్వరలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన

హనుమకొండలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. దసరాలోగా శంకుస్థాపన జరిగే అవకాశం ఉందన్నారు. కార్యాలయ నిర్మాణం కోసం ముఖ్య నేతలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే డీసీసీ పరిధిలో వివిధ కమిటీల ఎన్నిక పూర్తయిందని, గ్రామ, మండల కమిటీలను సైతం ఏర్పాటు చేశామని తెలిపారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్‌ కమిటీలను ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు.