జవహర్ నవోదయ విద్యాలయంలో వైద్య శిబిరం..
పరిశీలించిన వరంగల్ డీఎంహెచ్ ఓ డాక్టర్ బి.రాజారెడ్డి
స్పాట్ వాయిస్, మామునూరు : తిమ్మాపూర్‌లోని మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజారెడ్డి సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన డీఎంహెచ్ వో పాఠశాలలో పరిశుభ్రత, సురక్షిత తాగునీరు, నాణ్యమైన ఆహారం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. పాఠశాల పరిసరాలు, వంటశాల, భోజనశాలను పరిశీలించిన జిల్లా వైద్యాధికారి వంటశాలలో తయారు చేసిన ఆహారాన్ని స్వయంగా రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, సురక్షితమైన ఆహారం అందించడంతో పాటు పారిశుధ్య ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. అనంతరం ఇన్ చార్జి ప్రిన్సిపాల్ సముద్రాల ప్రవీన్ కుమార్, హెల్త్ సూపర్‌వైజర్‌తో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని అధికారులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పైడిపల్లి పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ జునైద్ ఖాన్, వైద్య సిబ్బంది పాల్గొని విద్యార్థులకు వైద్య సేవలు అందించారు.
