SPOT VOICE
Newspaper Banner
Date : 23 August 2026, 2:10 pm Posted By : SPOT VOICE MEDIA

ఎమ్మెల్సీ అభ్యర్థిగా గడల శ్రీనివాసరావు

జనసేన పార్టీ నిర్ణయం..
అధినేత పవన్ కళ్యాణ్ సుముఖత వ్యక్తం

స్పాట్ వాయిస్, హైదరాబాద్ : ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావును ముందస్తుగా ప్రకటించింది. పార్టీ రాష్ట్ర నాయకుడిగా, అధికార ప్రతినిధిగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్న గడల శ్రీనివాసరావును ఎమ్మెల్సీ బరిలో నిలపాలని పార్టీ నిర్ణయించింది. ఆయన అభ్యర్థిత్వానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుముఖత వ్యక్తం చేసినట్లు పార్టీ తెలిపింది. గతంలో వైద్య ఆరోగ్యశాఖలో ఉన్నతస్థాయి బాధ్యతలు నిర్వహించిన గడల శ్రీనివాసరావు ప్రస్తుతం జనసేన రాష్ట్ర నాయకుడిగా, అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. పట్టభద్రులు, ఉద్యోగులు, యువత సమస్యలను శాసన మండలిలో బలంగా వినిపించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. మూడు జిల్లాల పట్టభద్రులు తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. పట్టభద్రులు, ఉద్యోగులు, యువత, విద్యావంతులు, మేధావులు ఎదుర్కొంటున్న సమస్యలను మండలి వేదికగా బలంగా వినిపిస్తానని శ్రీనివాసరావు తెలిపారు. సమస్యలను కేవలం ప్రస్తావించడమే కాకుండా, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉమ్మడి మూడు జిల్లాలకు చెందిన పట్టభద్రులు, మేధావులు, ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు తనకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుని తెలంగాణలో జనసేన పార్టీ సత్తా చాటుతామని డాక్టర్ గడల శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.