SPOT VOICE
Newspaper Banner
Date : 21 August 2026, 7:50 am Posted By : SPOT VOICE MEDIA

హన్మకొండ SHOకి రాష్ట్రస్థాయి గుర్తింపు

  • డ్రగ్స్‌పైఅవగాహనలో టాప్-10 పోలీస్ స్టేషన్ లలో చోటు.

  • SHO మచ్చ శివకుమార్‌, CCRB ACP డేవిడ్‌ రాజ్‌లకు ప్రశంస

  • అభినందించిన ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్‌ శాండిల్య, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ లు

స్పాట్ వాయిస్ , హన్మకొండ: డ్రగ్స్‌ నిర్మూలన, యువతలో అవగాహన కల్పించడంలో హన్మకొండ పోలీస్‌ స్టేషన్‌ ప్రత్యేక గుర్తింపు పొందింది. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గత జూన్‌లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈగల్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంటీ డ్రగ్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమాల్లో అత్యుత్తమంగా పనిచేసిన టాప్‌-10 పోలీస్‌ స్టేషన్‌ SHOsను ఎంపిక చేశారు.

ఈ జాబితాలో హన్మకొండ పోలీస్‌ స్టేషన్‌ SHO మచ్చ శివకుమార్ స్థానం సంపాదించారు. హన్మకొండ పరిధిలో విద్యార్థులు, యువత, ప్రజల్లో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు ఆయన ప్రత్యేక చొరవ చూపారు. విద్యాసంస్థలు, వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా చైతన్యపరిచారు.

కార్యక్రమాల్లో విద్యార్థులు, యువత, ప్రజలను పెద్దఎత్తున భాగస్వామ్యం చేయడం, డ్రగ్స్‌ వినియోగం వల్ల ఎదురయ్యే సామాజిక, ఆరోగ్యపరమైన సమస్యలను వివరించడం వంటి అంశాల్లో ఆయన చూపిన చొరవను అధికారులు గుర్తించారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని కమాండెంట్‌ కంట్రోల్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈగల్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ లు హన్మకొండ SHO మచ్చ శివకుమార్‌, CCRB ACP డేవిడ్‌ రాజ్‌లకు ప్రశంసా పత్రంతో పాటు క్యాష్‌ రివార్డు అందజేశారు.

డ్రగ్స్‌ రహిత సమాజం కోసం పోలీస్‌ శాఖ చేపడుతున్న కార్యక్రమాల్లో హన్మకొండ పోలీసుల కృషికి ఈ గుర్తింపు ప్రత్యేక అభినందనగా నిలిచింది. యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు, ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ఈ గుర్తింపు మరింత ప్రోత్సాహాన్ని అందించనుంది.