SPOT VOICE
Newspaper Banner
Date : 23 August 2026, 6:52 pm Posted By : SPOT VOICE MEDIA

అవార్డుల కోసం అడ్డదారులు 

అవార్డుల కోసం అడ్డదారులు 

శిష్యుడిని అవినీతి ఆరోపణల నుంచి గట్టెక్కించేందుకు గురువుపన్నాగం

కేయూలో హాట్ టాపిక్ గా గురుశిష్యుల వ్యవహారం

స్పాట్ వాయిస్, వరంగల్ : అవార్డుల కోసం కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు గురుశిష్యులు అడ్డదారులు తొక్కుతున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న శిష్యుడి కోసం గురువు తనకున్న పరిచయాలను వాడి అతడిని కాపాడే ప్రయత్నం చేయడం కోసం పైరవీలు చేసి అవార్డులు ఇప్పించడం వర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. కాకతీయ యూనివర్సిటీలో సాహిత్య విభాగానికి చెందిన సదరు గురుశిష్యులు అవార్డుల వ్యవహారం సాహిత్య ప్రపంచంలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ కు బార్డర్ లో ఉండే తెలంగాణ జిల్లాకు చెందిన ఇద్దరు సాహితీవేత్తలు ఏపీకి చెందిన ప్రముఖ మహాకవి పేరిట ఏటా అవార్డు ఇచ్చి సత్కరిస్తుంటారు. అయితే క్రితంసారి కాకతీయ యూనివర్సిటీకి చెందిన అధ్యాపకుడిని ఆ అవార్డుకు ఎంపిక చేశారు. పద్యం రాయడంలో దిట్ట అయిన సదరు మహాకవి పేరిట ఇచ్చే అవార్డును.. పద్యం రాయరాని ప్రొఫెసర్ కు ఎలా ఇచ్చారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. సదరు అధ్యాపకుడు తొలినాళ్లలో ఉనికి కోసం అస్తిత్వవాదాన్ని కొంతకాలం మోసినప్పటికీ.. ఆ తర్వాత కేవలం తన వ్యక్తిగత స్వార్థం కోసం తప్పా తన జాతి కోసం ఏనాడు పనిచేసిన దాఖలాలు లేవని సొంత సామాజిక వర్గం వాళ్ల నుంచే విమర్శ ఉంది. అంతేగాక ఈ అవార్డు ఇచ్చినవాళ్లకు ఓ సాహిత్య విమర్శకుడు ఫోన్ చేసి.. ‘పద్యం రాసేవాళ్లకు ఇస్తారా.. మద్యం తాగేవాళ్లకు ఇస్తారా అని ‘శివా’లెత్తినట్లు తెలిసింది. అంతేగాక యూనివర్సిటీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తన శిష్యుడిని రక్షించేందుకు, తాను ప్రతిభావంతుడని ప్రచారం చేసేందుకు సదరు గురువు అవార్డుల వేటలో పడి ఆర్నెళ్ల క్రితం ఒక అవార్డు ఇప్పించడంతోపాటు.. ఇటీవల తానే కమిటీలో ఉండి తన శిష్యుడికి రాష్ట్ర స్థాయి అవార్డును ఇప్పించడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ ప్రముఖ కవి పేరిట ఏటా ఇచ్చే అవార్డు కమిటీకి సదరు ఆచార్యుడు కన్వీనర్ గా ఉన్నాడు. ఇప్పటికే 8 మందికిపైగా ఆ అవార్డు ఇచ్చారు. ఎప్పుడూ ఏదో ఒక అవార్డు తీసుకుని వార్తల్లో ప్రచారంలో ఉండాలనే యావతో ఈ సారి ఆ అవార్డును తానే తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంకేముంది కమిటీలో ముఖ్యులైన కవి కుటుంబ సభ్యులను ఒప్పించి తానే అవార్డు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇలా అవార్డుల చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇద్దరు గురుశిష్యుల వ్యవహారం చూసి కవులు, రచయితలు ముక్కున వేలేసుకుంటున్నారు.