SPOT VOICE
Newspaper Banner
Date : 18 August 2026, 1:47 pm Posted By : SPOT VOICE MEDIA

పాలు లేకుండానే నెయ్యి..

హైదరాబాద్‌లో 25.5 టన్నుల కల్తీ నెయ్యి సీజ్!

స్పాట్ వాయిస్, హైదరాబాద్‌: హైదరాబాద్ కమిషనరేట్‌ పరిధిలో కల్తీ నెయ్యి తయారీ గుట్టురట్టైంది. పాలు, వెన్న వంటి పాల ఉత్పత్తులను ఉపయోగించకుండా నెయ్యి పేరుతో కల్తీ ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. H-FAST అధికారులు నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో భారీగా కల్తీ నెయ్యిని గుర్తించారు.

తనిఖీల్లో మొత్తం 25.5 టన్నుల కల్తీ నెయ్యిని అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కల్తీ నెయ్యి తయారీలో ఎలాంటి పదార్థాలను ఉపయోగించారు? ఎక్కడి నుంచి ముడి పదార్థాలను తీసుకొచ్చారు? ఈ నెయ్యిని ఎక్కడెక్కడ విక్రయించారు? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

సాధారణంగా పాలు, వెన్న నుంచి తయారయ్యే నెయ్యికి బదులుగా నాణ్యత లేని పదార్థాలతో నకిలీ నెయ్యి తయారు చేసి మార్కెట్‌లోకి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి కల్తీ ఆహార పదార్థాల వినియోగం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఇటీవల గుజరాత్‌లోనూ భారీగా కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్కడ సుమారు 30 వేల లీటర్ల కల్తీ నెయ్యిని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ ఘటనలతో నెయ్యి కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.