19వ శతాబ్దపు క్యాస్లే.. రూ.335 కోట్లు..
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ భవంతి ప్రత్యేకతలివే..!
స్పాట్ వాయిస్, డెస్క్ : సోషల్ మీడియా దిగ్గజం మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మరో ఖరీదైన ఆస్తిని సొంతం చేసుకున్నారు. ఐర్లాండ్‌లోని 19వ శతాబ్దానికి చెందిన చారిత్రక భవంతిని జుకర్‌బర్గ్ ఆయన భార్య ప్రిసిల్లా చాన్ కలిసి సుమారు 30 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ.335 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసినట్లు సమాచారం. ‘స్ట్రాన్‌కల్లి క్యాస్లే’గా పిలిచే ఈ చారిత్రక భవనం ఏకంగా 440 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎస్టేట్‌లో ఉంది.
మెటా ఆఫీస్ కు 200 కి.మీ. దూరంలో..
ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో మెటా అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం ఉంది. జుకర్‌బర్గ్ కొత్తగా కొనుగోలు చేసిన క్యాస్లే అక్కడి నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐర్లాండ్‌కు తరచూ వెళ్లాల్సి వస్తుండటంతో అక్కడే ఒక సొంత నివాసం ఉండటం అనుకూలంగా ఉంటుందని భావించి ఈ భవంతిని కొనుగోలు చేసినట్లు సమాచారం. స్థానిక మీడియా కథనాల ప్రకారం వివరాలి ఉన్నాయి. జుకర్‌బర్గ్–ప్రిసిల్లా దంపతులు కొన్ని వారాల క్రితమే మార్కెట్ ధరకు ఈ ఆస్తిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే రూ.335 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిపే వివరాలు ఇప్పటివరకు ఐర్లాండ్ ప్రాపర్టీ ప్రైస్ రిజిస్టర్‌లో అధికారికంగా నమోదుకాలేదని సమాచారం.
1830లో నిర్మించిన చారిత్రక భవనం
స్ట్రాన్‌కల్లి క్యాస్లేకు దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర ఉంది. 19వ శతాబ్దంలో పైన్ సోదరులు ఈ భవనాన్ని డిజైన్ చేశారు. ప్రకృతి అందాల మధ్య, నది బ్యాక్‌వాటర్‌కు సమీపంలో ఉన్న ఈ భవంతిని 1830లో మాజీ ఎంపీ జాన్ కీలీ కోసం నిర్మించినట్లు తెలుస్తోంది. సుమారు 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం నిర్మాణ శైలి, విశాలమైన గదులు, చుట్టూ ఉన్న పచ్చదనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. భవనం ఎంత విశాలంగా ఉంటుందంటే.. కిచెన్ నుంచి డైనింగ్ హాల్‌కు చేరుకోవడానికి కూడా దాదాపు నాలుగున్నర నిమిషాలు పడుతుందని చెబుతారు.
25 ఏళ్లుగా నివాసంగా..
చారిత్రక క్యాస్లేలో దాదాపు 25 ఏళ్లుగా ర్యాబ్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు మైఖేల్ అలెన్ బక్లీ నివసించారు. తాజాగా ఆయన ఈ ఆస్తిని జుకర్‌బర్గ్ దంపతులకు విక్రయించినట్లు సమాచారం. అమెరికాలో ఇప్పటికే భారీ ఆస్తులు కలిగి ఉన్న జుకర్‌బర్గ్.. ఐర్లాండ్‌లో తన వ్యాపార కార్యకలాపాల నేపథ్యంలో ఈ కొత్త భవంతిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గత వేసవి నుంచే ఈ క్యాస్లే కొనుగోలుపై ఆయన ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో, చివరకు రూ.335 కోట్ల భారీ మొత్తానికి ఈ చారిత్రక భవంతి జుకర్‌బర్గ్ సొంతమైనట్లు సమాచారం. చరిత్ర, ప్రకృతి అందాలు, విశాలమైన ఎస్టేట్‌తో కూడిన ఈ 19వ శతాబ్దపు క్యాస్లే.. ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత సంపన్న టెక్ దిగ్గజాల్లో ఒకరైన మార్క్ జుకర్‌బర్గ్ కొత్త నివాసంగా మారనుంది.
