SPOT VOICE
Newspaper Banner
Date : 10 July 2026, 9:11 am Posted By : SPOT VOICE MEDIA

రఘునాథ్ పల్లి లో వరుస దొంగతనాలు

వ్యవసాయ  బావుల వద్ద దొంగతనం..

ఆగని చోరీలు.. రైతుల్లో ఆందోళన

స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: రఘునాథపల్లి మండల కేంద్రంలో వరుసగా దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు, ముఖ్యంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ప్రతి వారం ఏదో ఒక చోట చోరీ ఘటన చోటుచేసుకుంటోంది. గత గురువారం బైక్‌తో పాటు ట్రాక్టర్‌కు సంబంధించిన ఇంజిన్ ఆయిల్ చోరీకి గురైన విషయం మరువకముందే, తాజాగా శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో   ఖిలాషాపురం రోడ్డులోని దూకిరే మహేందర్, పేర్ని ఐలయ్యకు చెందిన వ్యవసాయ బావుల వద్ద అమర్చిన కాపర్ వైర్లను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న రైతులు ఇలాంటి వరుస చోరీలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాపర్ వైర్ల చోరీ కారణంగా బావుల మోటార్ల నిర్వహణకు అంతరాయం ఏర్పడటంతో పాటు రైతులకు అదనపు ఆర్థిక భారం పడుతోంది. మండల కేంద్రంలో తరచూ జరుగుతున్న దొంగతనాలను అరికట్టేందుకు రాత్రిపూట పోలీసు గస్తీని పెంచి, నిందితులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.