SPOT VOICE
Newspaper Banner
Date : 28 June 2026, 12:06 pm Posted By : SPOT VOICE MEDIA

బీజేపీ అసమర్థత వల్లే ‘టెట్’ పేపర్ లీకేజీ

యువత జీవితాలతో ఆడుకుంటున్న కూటమి ప్రభుత్వాలు

​కాంగ్రెస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు మేడిపల్లి రాజు గౌడ్ ఆగ్రహం

స్పాట్ వాయిస్, గణపురం: మహారాష్ట్రలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు మేడిపల్లి రాజు గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గణపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వాల అసమర్థ పాలన వల్లే పదే పదే పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని, కనీసం పరీక్షలను కూడా పకడ్బందీగా నిర్వహించడం చేతకావడం లేదని మండిపడ్డారు. దేశంలో ఎక్కడ బీజేపీ అధికారంలో ఉంటే అక్కడ నిరుద్యోగుల జీవితాలు రోడ్డున పడుతున్నాయని ధ్వజమెత్తారు. ​మహారాష్ట్రలో ఎన్నో ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న ‘టెట్’ పరీక్షను సక్రమంగా నిర్వహించడంలో అక్కడి కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మేడిపల్లి రాజు విమర్శించారు. లీకేజీ కారణంగా ఈ నెల 28న (ఆదివారం) జరగాల్సిన పరీక్ష వాయిదా పడటంతో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర నిరాశకు, ఆవేదనకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు ఎంతో కష్టపడి చదివిన అభ్యర్థుల భవిష్యత్తును ఆ ప్రభుత్వం బూడిదపాలు చేస్తోందని, యువత, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. ​టెట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యులైన వారిపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులైన నిరుద్యోగ అభ్యర్థులందరికీ తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.