చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సర్పంచ్ దుబాసి నవీన్
స్పాట్ వాయిస్, దామెర: మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదేళ్లలోపు చిన్నారులకు ఆరోగ్య శాఖ సిబ్బంది పోలియో నివారణ చుక్కలు వేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ దుబాసి నవీన్ చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి తల్లిదండ్రి తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ప్రభుత్వ ఆరోగ్య శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.