స్పాట్ వాయిస్ , దామెర: మండలంలోని ఒగ్లాపూర్ గ్రామ ప్రగతి పంచాయతీ కార్యాలయంలో సోమవారం ‘ప్రజాపాలన ప్రణాళిక’లో భాగంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ కేతిపెల్లి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎంపీడీఓ గుమ్మడి కల్పన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో అంటువ్యాధులు నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ చెత్తను తడి, పొడి, శానిటరీ, హానికరంగా వేరు చేసి పంచాయతీ సిబ్బందికి అందించాలని కోరారు. భూగర్భ జలాల సంరక్షణలో భాగంగా ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.