ఐదేళ్ల లోపు ప్రతి బిడ్డకూ పోలియో చుక్కలు వేయించాలి..
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ నీ లం మధు ముదిరాజ్
స్పాట్ వాయిస్, పటాన్ చెరు: దేశ భవిష్యత్తు చిన్నారుల ఆరోగ్య భద్రతపైనే ఆధారపడి ఉంటుందని, ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు. పల్స్ పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తన స్వగ్రామం చిట్కుల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలియో శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక వైద్య సిబ్బందితో కలిసి చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, పోలియో మహమ్మారిని దేశం నుంచి పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పల్స్ పోలియో కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా తమ పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఒకప్పుడు దేశాన్ని పట్టిపీడించిన పోలియోను నిరంతర పోలియో చుక్కల పంపిణీ ద్వారానే నియంత్రించగలిగామని, ఆ విజయాన్ని కొనసాగించేందుకు ప్రతి విడతలోనూ ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. గతంలో చుక్కలు వేసినా, ప్రతి పల్స్ పోలియో కార్యక్రమంలో మళ్లీ వేయించడం వల్ల రోగనిరోధక శక్తి మరింత బలపడుతుందని వివరించారు.
వైద్యానికి పెద్దపీట
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య, ఆరోగ్య రంగాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేస్తోందని, గ్రామీణ ప్రాంతాల పేదలకు కూడా కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా వంద శాతం పోలియో చుక్కల పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు.ఎండలు, వానలను లెక్కచేయకుండా ఇంటింటికీ వెళ్లి సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బంది సేవలను ఆయన అభినందించారు. ప్రయాణాల్లో ఉన్న తల్లిదండ్రులు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన మొబైల్ పోలియో కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి పల్లె, పట్టణంలో ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు అందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
