Date : 01 April 2026, 10:40 am Posted By : SPOT VOICE MEDIA
కొత్త బ్యాంకింగ్ రూల్స్
కస్టమర్లకు ఊరట..
లోన్స్, సిబిల్, నామినేషన్ లో కీలక మార్పులు
స్పాట్ వాయిస్, వరంగల్: ఆర్‌బీఐ 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్న కొత్త బ్యాంకింగ్ నిబంధనలు దేశవ్యాప్తంగా బ్యాంకు కస్టమర్లకు ఉపశమనం కలిగించేలా రూపొందించబడ్డాయి. లోన్స్, సిబిల్ స్కోర్, నామినేషన్, గోల్డ్ లోన్స్ వంటి కీలక అంశాల్లో మార్పులు తీసుకువచ్చి పారదర్శకతను పెంచే దిశగా ఈ నిర్ణయాలు తీసుకుంది.
నామినేషన్‌లో భారీ మార్పు
ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలు లేదా లాకర్లకు ఒకటి లేదా రెండు నామినీలను మాత్రమే చేర్చుకునే అవకాశం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై గరిష్టంగా నాలుగు మంది నామినీలను నమోదు చేసుకోవచ్చు. దీంతో కుటుంబ సభ్యులకు ఆస్తుల బదిలీ సులభమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
వారానికి ఒకసారి సిబిల్ స్కోర్ అప్‌డేట్
CIBIL స్కోర్‌ను ఇప్పటివరకు నెలకు ఒకసారి మాత్రమే అప్‌డేట్ చేసేవారు. అయితే కొత్త రూల్ ప్రకారం ప్రతి ఏడు రోజులకు ఒకసారీ సిబిల్ స్కోర్ అప్‌డేట్ కానుంది. దీంతో లోన్ EMIలు చెల్లించిన వెంటనే స్కోర్‌లో మార్పులు కనిపించి, వినియోగదారులకు త్వరితగతిన లాభం చేకూరుతుంది.
ముందస్తు లోన్ చెల్లింపులపై ఛార్జీలు రద్దు
ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో తీసుకున్న హోమ్, కార్, ఎడ్యుకేషన్, పర్సనల్ లోన్లపై ముందస్తు చెల్లింపులకు ఇకపై బ్యాంకులు ఎలాంటి జరిమానా విధించవు. దీంతో వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా ఎప్పుడైనా తమ లోన్లను ముగించుకునే అవకాశం లభిస్తుంది.
గోల్డ్ మెటల్ లోన్ గడువు పెంపు
బంగారు ఆభరణాల వ్యాపారులు తీసుకునే గోల్డ్ మెటల్ లోన్ (GML) చెల్లింపు గడువును 180 రోజుల నుంచి 270 రోజులకు పెంచారు. దీంతో నగల వ్యాపారులకు నగదు నిర్వహణలో సౌలభ్యం ఏర్పడుతుంది.
మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి తక్కువ వడ్డీ
సిబిల్ స్కోర్ తరచుగా అప్‌డేట్ అవ్వడం వల్ల మంచి క్రెడిట్ ప్రొఫైల్ ఉన్న కస్టమర్లు బ్యాంకులతో తక్కువ వడ్డీ రేట్లపై చర్చించే అవకాశం ఉంటుంది. దీంతో త్వరగా లోన్ పొందే అవకాశాలు కూడా పెరుగుతాయి.
ఆర్‌బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త బ్యాంకింగ్ నిబంధనలు కస్టమర్లకు మరింత నియంత్రణ, పారదర్శకత, ఆర్థిక సౌలభ్యాన్ని అందించనున్నాయి. ముఖ్యంగా లోన్స్ తీసుకునే వారు, క్రెడిట్ స్కోర్ మెరుగుపరుచుకోవాలనుకునే వారికి ఇవి పెద్ద ఉపశమనం కలిగించనున్నాయి.