డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి..
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
స్పాట్ వాయిస్, నర్సo పేట : ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమస్యల పరిష్కారంలో సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నర్సంపేట బస్టాండ్ ఆవరణలోనే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తోటి కార్మికులు మంటలు ఆర్పి వెంటనే అతడిని వరంగల్ ఎంజీఎం కు , అక్కడ నుంచి కంచన్‌బాగ్ డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆస్పత్రికి చేరుకుని శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి పై అపోలో ఆసుపత్రి వైద్యులతో మాట్లాడానురు. మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఈ క్రమంలోనే చికిత్సపొందుతూ రాత్రి 2:30 గంటల సమయంలో మృతిచెందారు. శంకర్ గౌడ్ మృతదేహానికి వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించగా, అనంతరం అతడి కుటుంబసభ్యులు మృత దేహన్ని శంకర్ గౌడ్ స్వగ్రామం ఖానాపురం మండలం ముత్తోజిపేటకి తరలించారు. శంకర్ గౌడ్‌కు భార్య లత, కుమారుడు హేమంత్, కుమార్తె షామిలీ ఉన్నారు. శంకర్ గౌడ్ మృతితో శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది.
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దు:ఖసాగరంలో ముంచిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు.