SPOT VOICE
Newspaper Banner
Date : 11 April 2026, 8:25 pm Posted By : SPOT VOICE MEDIA

బహిరంగ మూత్రవిసర్జన చేస్తే రూ. 500 జరిమానా

26వ వార్డు కౌన్సిలర్ మండల శ్రీదేవి-శ్రీనివాస్ హెచ్చరిక
స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: పట్టణంలోని పరిసరాల పరిశుభ్రతను కాపాడటం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని 26వ వార్డు కౌన్సిలర్ మండల శ్రీదేవి- శ్రీనివాస్ స్పష్టం చేశారు. 26వ వార్డులోని మెయిన్ రోడ్డు నుంచి జయశ్రీ టాకీస్, ఫారెస్ట్ ఆఫీస్ కాంపౌండ్ మధ్య ఉన్న రహదారిపై పాదచారులు, వ్యాపారస్తులు బహిరంగంగా మూత్రవిసర్జన చేస్తుండటంతో స్థానిక నివాసితులకు, ముఖ్యంగా మహిళలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే విషయమై శుక్రవారం స్థానికులకు అక్కడ మూత్రవిసర్జన చేస్తున్న మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. స్థానికులు మూత్రవిసర్జన చేస్తున్న వారిని నిలదీయగా, వారు తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరారు. ఇకపై ఈ ప్రాంతంలో ఎవరైనా.. మూత్రవిసర్జన చేస్తూ పట్టుబడితే రూ.500 జరిమానా విధించనున్నట్లు కౌన్సిలర్ ప్రకటించారు. ఈ మేరకు అవగాహన కల్పిస్తూ గోడలపై అంటించేందుకు ప్రత్యేక స్టిక్కర్లను ప్రదర్శించారు. ప్రజల అవసరాల దృష్ట్యా, సమీపంలోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించి మున్సిపల్ చైర్మన్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే అక్కడ ఒక ‘సులభ్ కాంప్లెక్స్’ (పబ్లిక్ టాయిలెట్) ఏర్పాటుకు కృషి చేస్తానని కౌన్సిలర్ హామీ ఇచ్చారు. పరిసరాల పరిశుభ్రత పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో గుండెబోయిన శివ కోటి, దోనాల రవి, పంజాల రాజు, డిష్ బాబా, ఆంబోతు రాజు, అడుప రాంబాబు, నీరటి రంజిత్, తదితరులు పాల్గొన్నారు.