శ్రీవిద్య ఆత్మహత్య కేసులో వీసీ నిర్ణయం
స్పాట్ వాయిస్, ఓరుగల్లు : కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్ కాలేజ్‌లో చదువుతున్న ఎంఎస్సీ (ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ) సెకండియర్ విద్యార్థిని పి. శ్రీవిద్య ఆత్మహత్య ఘటనలో ఆరుగురు విద్యార్థినులపై కేయూ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఒక సెమిస్టర్ వరకు వారిని సస్పెండ్ చేస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరుగురు సీనియర్లు తనపై దొంగతనం మోపడం తోపాటు రూమ్ లో వేసి చితకబాదారని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా విద్యార్థిని శ్రీ విద్య మార్చి 16న ఆత్మహత్య కు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె చనిపోయే ముందు ఆస్పత్రిలో ఆరుగురు సీనియర్ల పేరు వెల్లడించిందింది. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు విశ్వవిద్యాలయం ఒక విచారణ కమిటీని నియమించింది. కమిటీ తన నివేదికను సమర్పించిన అనంతరం, ఆ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టింది.
విచారణ కమిటీ సిఫార్సుల మేరకు, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ విభాగాలకి చెందిన మొత్తం ఆరుగురు విద్యార్థులపై ఒక సెమిస్టర్ పాటు (ప్రస్తుతం కొనసాగుతున్న సెమిస్టర్) సస్పెన్షన్ విధించాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈ సస్పెన్షన్‌లో ఈ సెమిస్టర్ పరీక్షలు కూడా రాయడానికి వీల్లేదు.
విద్యార్థుల అడ్మిషన్‌ను తక్షణమే నిలిపివేయాలని, చేపట్టిన చర్యలపై నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని సంబంధిత విభాగాధిపతికి ఆదేశాలు జారీ చేశారు.