SPOT VOICE
Newspaper Banner
Date : 07 April 2026, 9:20 pm Posted By : SPOT VOICE MEDIA

అదనపు కట్నం కోసం పెండ్లి కొడుకు పరార్..

పురుగుల మందు డబ్బాతో అమ్మాయి కుటుంబం ధర్నా
కమలాపూర్ మండలంలో ఘటన

స్పాట్ వాయిస్, కమలాపూర్: హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో అదనపు కట్నం కోసం పెళ్లికొడుకు పరారైన ఘటన కలకలం రేపింది. మార్చి 6వ తేదీన జరగాల్సిన పెళ్లికి రెండు రోజుల ముందే వరుడు కనిపించకుండా పోయాడని పెళ్లి కూతురు తండ్రి పొన్నాల రాజయ్య తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు అబ్బాయి ఇంటి ముందు మంగళవారం పురుగుల మందు డబ్బాతో బైఠాయించి ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఎల్కతుర్తి మండలం దండపల్లి గ్రామానికి చెందిన పొన్నాల రాజయ్య కుమార్తెకు కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన వీరబోయిన రాజయ్య చిన్నకుమారుడు కిరణ్‌తో వివాహం నిశ్చయమైంది. అబ్బాయి వాళ్లు 35 లక్షల వరకట్నం కావాలి అడగగా రూ.26 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. ఎంగేజ్‌మెంట్ సమయంలో రూ.10 లక్షలు అప్పగించినట్లు చెప్పారు. పెళ్లి సమయం దగ్గరపడుతున్న వేళ వరుడు కుటుంబ సభ్యులు అదనంగా రూ.9 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. అంత మొత్తాన్ని ఇవ్వలేమని అమ్మాయి కుటుంబ సభ్యులు చెప్పడంతో పెళ్లికి రెండు రోజుల ముందు వరుడు పరారైనట్లు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు పొన్నాల రాజయ్య తెలిపారు. అబ్బాయి తల్లిదండ్రులే తమ కుమారుడిని దాచిపెట్టి అదనపు కట్నం కోసం పెండ్లి నిలిపివేశారని అమ్మాయి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పెళ్లి ఆగిపోవడంతో తమ పరువు పోయిందని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పురుగుల మందు డబ్బాతో అబ్బాయి ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.