గణపురంలో విషాదం.. పొలంలోనే కుప్పకూలిన తిరుపతి
అనాథలైన భార్య, ఇద్దరు పిల్లలు
స్పాట్ వాయిస్, గణపురం: భానుడి ప్రతాపానికి జిల్లాలో ఓ నిరుపేద కౌలురైతు బలైపోయాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో వడదెబ్బ తగిలి పెండ్యాల తిరుపతి (34) అనే రైతు పొలంలోనే కుప్పకూలి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. తిరుపతి గ్రామానికి చెందిన శ్రీపతి రాజనర్సు వద్ద పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం పనుల నిమిత్తం చేనుకు వెళ్లిన ఆయన, రాత్రి వరకు తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం తోటి రైతులు పొలంలో తిరుపతి మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బ తగిలే ఆయన మరణించి ఉంటారని భావిస్తున్నారు. మృతునికి భార్య సరిత, కుమారుడు మహీధర్, కుమార్తె పల్లవి ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం వీధిన పడింది. ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
