
“బట్టలు మార్చినంత ఈజీ కాదు..
పార్టీ మారడం”
– ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ తనపై వస్తున్న రాజకీయ ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. తాను బీఆర్‌ఎస్‌ను విడిచి బీజేపీలో చేరి ఐదేళ్లు అవుతున్నాయని గుర్తుచేసిన ఆయన, మళ్లీ పార్టీ మారుతున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు.
“నేను పార్టీ మారను…”
తాను ఎప్పుడూ పార్టీ మారే ఆలోచనలో లేనని, పార్టీలు మారడం అంత సులభం కాదని అన్నారు. ప్రజలకు కూడా ఇదే సందేశం ఇచ్చానని చెప్పారు. తన రాజకీయ జీవితం గురించి తెలంగాణ ప్రజలకు పూర్తిగా అవగాహన ఉందని, ఇలాంటి తప్పుడు ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు.
బీఆర్‌ఎస్‌లో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, “25 ఏళ్ల అనుభవంలో ఎక్కువ మంది పరిచయాలు, అభిమానులు అక్కడే ఉన్నారు” అని తెలిపారు. ఈటెలను దూరం చేయడం ద్వారా కేసీఆర్ తప్పు చేశారని ప్రజల్లో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. అయితే, మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరతాననే ప్రచారం పూర్తిగా నిరాధారమని ఖండించారు.
వ్యక్తిగత ఆరోపణలు
తనను బర్తరఫ్ చేయడమే కాకుండా అనేక ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. కోళ్ల ఫారాలు కూల్చడం, భూములను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు తీసుకున్నారని అన్నారు. తాను చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఆస్తులను కూడా ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రికి లేఖ రాయనున్నట్లు తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు
ప్రస్తుత ప్రభుత్వం మీడియాను మేనేజ్ చేస్తోందని, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా పాలన సాగుతోందని ఆరోపించారు. అబద్ధాల పునాదుల మీదే ఈ ప్రభుత్వం ఏర్పడిందని, అదే విధంగా పాలన కొనసాగుతోందని విమర్శించారు. భూముల అక్రమాలు పెరిగినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.
వైఎస్ ఆహ్వానం గురించి
తన రాజకీయ జీవితంలో పలు పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినట్లు ఈటెల వెల్లడించారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్) లో చేరాలని కోరుతూ, కోరుకున్న మంత్రిపదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారని చెప్పారు. అయితే, తాను పదవుల కోసం రాజకీయాలు చేయనని, కమిట్‌మెంట్‌తో ఉద్యమంలోనే కొనసాగానని స్పష్టం చేశారు.
రాజకీయ ప్రణాళికలు
బీజేపీ తరఫున ఆరుగురు ఎంపీలు ఉన్నామని, ఎమ్మెల్యేలతో కలిసి పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. తొలి కార్యక్రమంగా “చలో బాలాజీ నగర్” చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎన్నికల కోసం సర్వేలు నిర్వహిస్తున్నామని, గెలుపు మా దేనని ధీమా వ్యక్తం చేశారు.
పదవులపై ఆసక్తి లేదని స్పష్టం
కాంగ్రెస్‌లో చేరితే మంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, తాను ఆ దారిని ఎంచుకోలేదని తెలిపారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదని, సిద్ధాంతాల కోసం రాజకీయాలు చేస్తున్నానని స్పష్టం చేశారు.
హుజూరాబాద్, స్థానిక రాజకీయాలు
హుజూరాబాద్‌లో తన నాయకత్వంలో పార్టీ బలంగా ఉందని, గతంలో స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని గుర్తుచేశారు. ఈసారి కూడా గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని, వ్యక్తిగత అనుబంధాలకు ప్రాధాన్యం ఇవ్వబోమన్నారు.
ప్రజలను, ధర్మాన్ని నమ్ముకున్నానని, సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మొద్దని ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. సమయం వచ్చినప్పుడు తన రాజకీయ బలం ఏంటో చూపిస్తానని హెచ్చరించారు.