SPOT VOICE
Newspaper Banner
Date : 01 April 2026, 1:12 pm Posted By : SPOT VOICE MEDIA

దలపతి ఆస్తులు “రూ.600 కోట్లు”

‘దళపతి’ విజయ్ ఆస్తులు రూ. 600 కోట్లు..
గ్యారేజీలో ఆకర్షిస్తున్న ‘సాధారణ’ వాహనం!

స్పాట్ వాయిస్, వరంగల్: దశాబ్దాల పాటు వెండితెరపై దళపతిగా తమిళ ప్రేక్షకుల హృదయాలను ఏలిన స్టార్ హీరో విజయ్, ఇప్పుడు ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ అధినేతగా పూర్తిస్థాయి రాజకీయ నాయకుడి అవతారం ఎత్తారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆయన, పెరంబూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో నామినేషన్ దాఖలు చేసిన విజయ్, ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పులు, ఆదాయ వివరాలను అత్యంత పారదర్శకంగా వెల్లడించారు. ఈ అఫిడవిట్ లో ఆయన ప్రకటించిన ఒక సామాన్యుడి వాహనం ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

ఆస్తుల చిట్టా.. అప్పులు సున్నా!

  • విజయ్ సమర్పించిన పత్రాల ప్రకారం ఆయన ఆర్థిక మూలాలు చాలా బలంగా ఉన్నాయి. వందల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఆయనకు ఒక్క రూపాయి కూడా అప్పు లేకపోవడం విశేషం.
  • చరాస్తులు: విజయ్ పేరిట బ్యాంకు డిపాజిట్లు, నగదు, వాహనాలు, ఆభరణాలు కలుపుకుని మొత్తం రూ. 404.58 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి.
  • స్థిరాస్తులు: ఇళ్లు, భూములు, వాణిజ్య భవనాలు వంటి స్థిరాస్తుల విలువ సుమారు రూ. 220 కోట్లుగా చూపించారు. ఇందులో ఆయన స్వయంగా సంపాదించిన వాటితో పాటు వారసత్వంగా వచ్చిన ఆస్తులు కూడా ఉన్నాయి.
  • నగదు & పెట్టుబడులు: తన చేతిలో కేవలం రూ. 2 లక్షల క్యాష్, భార్య సంగీత వద్ద రూ. 1 లక్ష క్యాష్ ఉన్నట్లు తెలిపారు. అయితే వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) రూపంలో అత్యధికంగా రూ. 388 కోట్ల పెట్టుబడులు ఉన్నట్లు వెల్లడించారు.
  • అప్పులు: బ్యాంకుల నుంచి కానీ, ఇతర సంస్థల నుంచి కానీ విజయ్‌కు ఎలాంటి బకాయిలు లేవు (జీరో డెబ్ట్).
  • బంగారం & వెండి: 883 గ్రాముల బంగారం (దీని విలువ దాదాపు రూ. 1.20 కోట్లు), రూ. 15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు ప్రకటించారు.

 

ఖరీదైన కార్ల మధ్యలో ‘టీవీఎస్ ఎక్స్‌ఎల్’

విజయ్ వెల్లడించిన అఫిడవిట్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఆయన వాహనాల జాబితా. ఆయన గ్యారేజీలో ఉన్న మొత్తం వాహనాల విలువ సుమారు రూ. 14.35 కోట్లు.

  • ఇందులో బీఎండబ్ల్యూ 530, బీఎండబ్ల్యూ ఐ7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్‌ఫైర్ లాంటి అత్యాధునిక, ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి.
  • ఇంతటి విలాసవంతమైన కార్ల మధ్యలో సామాన్యులు వాడే ఒక సాధారణ మారుతీ సుజుకీ స్విఫ్ట్ కారు, అలాగే ఒక టీవీఎస్ ఎక్స్‌ఎల్ (TVS XL Super) మోపెడ్ కూడా ఉండటం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఒక స్టార్ హీరో వద్ద ఈ ద్విచక్ర వాహనం ఉండటం నెట్టింట వైరల్‌గా మారింది.

 

i

ఆదాయ మార్గాలు – గడిచిన ఐదేళ్ల లెక్కలు

సినిమా రెమ్యునరేషన్లు, వ్యాపార పెట్టుబడులు, బ్యాంకు వడ్డీలు, మరియు తన ఆస్తుల ద్వారా వచ్చే అద్దెల ద్వారానే తనకు ప్రధానంగా ఆదాయం వస్తోందని విజయ్ వివరించారు. ఆయన గడిచిన ఐదేళ్ల ఆదాయ వివరాలు కింది విధంగా ఉన్నాయి:

  • 2024-25: రూ. 184.53 కోట్లు
  • 2023-24: రూ. 105.69 కోట్లు
  • 2022-23: రూ. 198.71 కోట్లు
  • 2021-22: రూ. 237.46 కోట్లు

ఇక 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తన భార్య సంగీతకు రూ. 6 లక్షల మేర ఆదాయం వచ్చినట్లు విజయ్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ఎక్కడా ఎలాంటి దాపరికాలు లేకుండా, పక్కా క్లారిటీతో విజయ్ తన ఆస్తులు, ఆదాయ వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాజకీయాల్లోకి పారదర్శకంగా అడుగుపెట్టాలని ఆయన భావిస్తున్న తీరుకు ఈ అఫిడవిట్ నిదర్శనమని అభిమానులు, పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. వందల కోట్ల ఆస్తులున్నా.. అప్పులు లేని నాయకుడిగా బరిలోకి దిగుతున్న దళపతి, ఓటర్ల మనసులను ఏ మేర గెలుచుకుంటారో వేచి చూడాలి.