
- మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటన
స్పాట్ వాయిస్ , వరంగల్ : రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి (SSC) పరీక్షల ఫలితాలు రేపు మధ్యాహ్నం 2 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఫలితాలను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERT) కార్యాలయంలో విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ పాల్గొని ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడ్డాయి. మొత్తం 5 లక్షల 28 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అందులో సుమారు 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 10 వేల మందికి పైగా సప్లిమెంటరీ విద్యార్థులు ఉన్నారు.

పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, కట్టుదిట్టమైన పర్యవేక్షణ మధ్య నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు. ఇక ఫలితాల విడుదలతో విద్యార్థుల భవిష్యత్తు విద్యా ప్రణాళికలకు మార్గం సుగమం కానుంది. ముఖ్యంగా ఇంటర్ అడ్మిషన్ల దిశగా ఈ ఫలితాలు కీలకంగా ఉండనున్నాయి.
ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్లలో తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాల సమయంలో సర్వర్లు బిజీ అయ్యే అవకాశం ఉన్నందున విద్యార్థులు ఓర్పుతో ప్రయత్నించాలని అధికారులు సూచించారు.