SPOT VOICE
Newspaper Banner
Date : 22 March 2026, 6:54 pm Posted By : SPOT VOICE MEDIA

ప్రజాప్రభుత్వం కాదు.. పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వం…

క్రికెట్‌ టోర్నమెంట్‌ను రాజకీయం చేస్తుండ్లు
పోలీసులే ప్రధాన ఆధారంగా ప్రభుత్వం నడుస్తోంది
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌
స్పాట్ వాయిస్, మల్హర్ : ప్రజా ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం పార్టీ కార్యకర్తల కోసమే నడుస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అసహనం వ్యక్తం చేశారు. మల్హర్ మండలం కొయ్యూరులో స్వర్గీయ పుట్ట లింగమ్మ స్మారకార్థం పుట్ట మధన్న ఫ్రెండ్లీ యూత్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంథని నియోజకవర్గ స్థాయి పుట్ట మధన్న ప్రీమియర్ లీగ్ సీజన్ -1 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లు గండ్ర వెంకటరమణ రెడ్డి, పుట్ట మధూకర్, మాజీ జెడ్పీ ఛైర్మన్ జక్కు శ్రీ హర్షిణిరాకేష్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఎనుగుల రాకేష్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా క్రీడాభిమానుల కోసం నిర్వహించే క్రికెట్‌ టోర్నమెంట్‌ను రాజకీయం చేయడం సరైంది కాదన్నారు. రాజకీయాలు మాట్లాడే వేదిక కాకపోయినా పరిస్థితులు మాట్లాడేలా చేస్తున్నాయన్నారు. ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలే కానీ పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసం పనిచేయడం ఏంటని ప్రశ్నించారు. ఏ రాజకీయ పార్టీకైనా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉండడం సహజమని, అయితే ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒక్క మంథనిలోనే కాదు యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉందన్నారు. ఏనాడు లేని విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాజకీయాల్లో పెడదోరణి కన్పిస్తోందన్నారు. ఇంత భయానక వాతావరణంలో ప్రభుత్వం నడిపిన చరిత్ర ఇప్పుడే చూస్తున్నామన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిపాలన చేసినా ఏనాడు పార్టీలు, రాజకీయాల గురించి ఆలోచన చేయలేదని, సాయం కోరిన వచ్చిన వ్యక్తిని న్యాయం చేశామే తప్ప ఆ వ్యక్తి ఎవరు, ఏ పార్టీ అని ఆలోచన చేయలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పోలీసులే ఆధారంగా నడుస్తోందని, ఎవరైనా సోషల్‌మీడియాలో పోస్టు పెడితే చాలు పోలీసులు స్పందించి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే సంకల్పంతో మహేష్‌రెడ్డి నిర్వహిస్తున్న టోర్నమెంట్‌కు వివక్ష చూపుతున్నారని, మహేష్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని నమ్మి గొప్పగా పని చేశారని, ఆయన అనుకున్న విధానాలు ప్రభుత్వ పాలనతో కనబడకపోవడంతోనే బయటకు వచ్చాడని, అలాంటి ధైర్యం, తెగింపు ఉన్న నాయకుడి స్పూర్తి గొప్పదన్నారు. మహేష్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీ, నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడు అండగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు.


యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలే..
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నేటి యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. పుట్ట లింగమ్మ స్మారకంగా మల్హర్‌ మండలం కొయ్యూర్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పుట్ట మధన్న ప్రీమియర్‌ లీగ్‌ టోర్నమెంట్‌ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ దేశాల్లో నేడు జరుగుతున్న ఏ క్రీడాపోటీల్లో మనం విజయం సాధించలేదని, కానీ క్రికెట్‌లో మాత్రం మనవాళ్లు సత్తాచాటుతున్నారని, అలాంటి క్రికెట్‌ పట్ల మక్కువ చూపాలన్నారు. ప్రస్తుత పరిస్థితులతో ప్రతి మనిషి అనారోగ్యాల పాలు అవుతున్నారని, అలా కాకుండా ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండేలా ఇటు వ్యాయామం, అటు క్రీడలు ఆడాలని ఆయన సూచించారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ పోరాట పటిమకల్గిన నాయకుడని, ఆయన యువతను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు చేపడుతుంటాడని కొనియాడారు. తాను మంథని ఎమ్మెల్యేతో అనేక ఏండ్లు కలిసి పని చేసినా ఆయనతో అనుబంధం ఆ కార్యక్రమం మట్టుకే ఉంటుందని, కానీ పుట్ట మధూకర్‌ అలా కాదని, ఒక్కసారి పరిచడం అయితే జీవితాంతం పలుకరిస్తూనే ఉంటారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేసి విజయం సాధించుకునే దిశగా ప్రతి ఒక్కరు పని చేయాలని ఆయన ఈసం దర్బంగా పిలుపునిచ్చారు. అధికారం కోసం అనేక హమీలు ఇచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండి చేయి చూపించారని ఆయన ఎద్దేవా చేశారు.

నమ్మినోళ్లను నట్టేట ముంచడం ఎమ్మెల్యే నైజం…
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌
అధికారం…పదవుల కోసం నమ్మినోళ్లను నట్టేట ముంచడం మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ నైజమని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. కొయ్యూర్‌లో క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభోత్సవానికి ఆయన సభాధ్యక్షత వహించి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు రామాయణం, మహాబారతం చదివి అర్థం చేసుకోవడం కంటే దుద్దిళ్ల కుటుంబ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గంలోని 60 ఏండ్ల నుంచి 20 ఏండ్ల వయస్సు వాళ్లంతా అమాయకంగా ఉండటం మూలంగానే మోసం చేస్తున్నారని, అందులో కుంభం మహేష్‌రెడ్డి అనే యువకుడు ఒకడని అన్నారు. హైదరాబాద్‌లో ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవించే మహేష్‌రెడ్డి ఈ ప్రాంతంలో యాక్టివ్‌ ఉండటంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో దుద్దిళ్ల శ్రీధర్‌, ఆయన సోదరుడు శ్రీను క్యాప్చర్‌ చేసి పార్టీలో చేర్పించుకున్నారని తెలిపారు. అటుతర్వాత దుద్దిళ్ల గెలుపు కోసం మహేష్‌రెడ్డి ఎంతో కృషి చేశారని, దుద్దిళ్ల శ్రీధర్‌ గెలిస్తే తనలాంటి వాళ్లకు న్యాయం జరుగుతుందని బావించి ఎంతో కష్టపడ్డాడని తెలిపారు. అయితే మంత్రి అయిన తర్వాత మహేష్‌రెడ్డికి గొప్ప బహుమానం ఇచ్చాడన్నారు. తన గెలుపులో ప్రముఖపాత్ర ఉన్న మహేష్‌రెడ్డికి సాయం చేయకుండా ఉన్న ఆధారాన్ని తొలగించాడని గుర్తు చేశాడు. ఇలా మూడు ఓట్లు ఉన్న కుటుంబం అనేక మందిని నమ్మించి మోసం చేస్తున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలని, క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ఈ టోర్నమెంట్‌కు శ్రీకారం చుట్టారన్నారు. గొప్పగా ఆలోచన చేసిన మహేష్‌రెడ్డి, వేముల శ్రీశైలం, మంథని లక్ష్మణ్‌రావు, బుర్రి నాగరాజులను ఆయన అభినందించారు.


పుట్ట మధన్న అందరికి ఆదర్శం…
బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు రాకేష్‌రెడ్డి
విజయం కోసం ప్రయత్నం చేసే మాజీ ఎమ్మెల్యే పుట్ట మధన్న అందరికి ఆదర్శమని బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు రాకేష్‌రెడ్డి అన్నారు. కొయ్యూర్‌లో జరిగిన పుట్ట లింగమ్మ స్మారక క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంబోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించడంలో, యువతలో స్పూర్తిని నింపడంలో పుట్ట మధన్న ఆత్మ విశ్వాసం ఎంతో గొప్పదన్నారు. రాష్ట్ర పెద్దనాయకుడైన మంత్రి శ్రీధర్‌బాబు గురించి ఇప్పుడిప్పుడే తెలుస్తోందని, ఐస్‌తో చంపే వ్యక్తి అని అన్నారు. మంథనిలో ఫ్యాక్షనిజం కంటే పెద్ద పోరాటం జరుగుతోందని అర్థం అవుతుందన్నారు. అయితే యువతతో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయడం అభినందనీయమని, గ్రామీణ ప్రాంతాల్లోనే గొప్ప క్రీడాకారులు ఉంటారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరిలో టీం స్పిరిట్‌ ఉండాలని, జట్టుగా ఉండి పోరాటం చేస్తేనే విజయం సాధించగలమని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు.


క్రీడా స్పూర్తిని పెంపొందించుకోవాలి..
మాజీ జెడ్పీ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌ 
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులు క్రీడాస్పూర్తిని పెంపొందించుకోవాలని, ఆ దిశగా టోర్నమెంట్‌ నిర్వహించడం అభినందనీయమని భూపాలపల్లి మాజీ జెడ్పీ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌ అన్నారు. మల్హర్‌ మండలం కొయ్యూర్‌లో నిర్వహించిన పుట్ట లింగమ్మ స్మారక క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ టోర్నమెంట్‌ పోరాట పటిమను స్పూర్తిగా ఇచ్చిందన్నారు.నిర్వాహకులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ టోర్నమెంట్‌లో ఫస్ట్‌ విన్నర్‌కు తాను ప్రైజ్‌ మనీ ఇస్తామని ప్రకటించారు. అలాగే ఇండియన్‌ విమెన్‌ క్రికెట్‌ టీం ఉన్నట్లుగానే ఈ ప్రాంతంలోని ఆడబిడ్డలకు సైతం క్రికెట్‌లో కోచింగ్‌ ఇచ్చి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. క్రికెట్‌ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి కోచింగ్‌ ఇవ్వాలని, అందుకు తనవంతు సహకారం అందిస్తామని ఆమె ఈ సందర్బంగా స్పష్టం చేశారు.