SPOT VOICE
Newspaper Banner
Date : 30 March 2026, 9:04 am Posted By : SPOT VOICE MEDIA

అడవిలో ఓ మానవీయ స్పర్శ…

మావోయిస్టులతో కలిసి ఎస్సై భోజనం

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో మానవీయ ఘటన

స్పాట్ వాయిస్, వరంగల్: ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో సాధారణంగా వినిపించే కథలు భయానకంగా ఉంటాయి — తుపాకీ శబ్దాలు, ఎదురు దాడులు, నిత్యం ఉద్రిక్తత. కానీ అదే అడవిలో ఆదివారం ఒక చిన్న మానవీయ ఘటన చోటుచేసుకుంది… మనసులను తాకేలా.
  • కాంకేర్‌ జిల్లాలోని దండకారణ్యం అడవుల్లో ముగ్గురు మావోయిస్టులు లొంగిపోవడానికి వస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. ఆ సమాచారం తెలుసుకున్న పార్తాపూర్‌ ఎస్సై రామేశ్వర్‌ చతుర్వేది, ఎలాంటి భద్రతా దళాల ఆర్భాటం లేకుండా స్వయంగా అడవిలోకి నడుచుకుంటూ వెళ్లారు.
  • ఆకలిని గుర్తించాడు..

  • కాలినడకన గంటల తరబడి ప్రయాణించి, చివరకు ఆ ముగ్గురిని కలుసుకున్నారు — రాధిక కుంజం, సందీప్‌ కడియం, రైను పద్మ. వారిని చూసిన ఎస్సైకు ఒక విషయం వెంటనే అర్థమైంది… వారు కేవలం లొంగిపోవడానికి వచ్చినవాళ్లు మాత్రమే కాదు, ఆకలితో అలమటిస్తున్న మనుషులు కూడా అని అనుకున్నాడు.
    అడవిలో రోజుల తరబడి తిరుగుతూ వచ్చిన వారికి తిండి దొరకలేదని తెలిసిన ఎస్సై, వెంటనే భోజనం ఏర్పాటు చేశారు. పోలీస్‌ అధికారిగా కాకుండా, ఒక మనిషిగా స్పందించారు. ఆ ముగ్గురితో కలిసి నేలమీద కూర్చుని భోజనం చేశారు.
    ఆ క్షణంలో తుపాకులు, సిద్ధాంతాలు, భయాలు అన్నీ పక్కకు తప్పుకున్నాయి… మిగిలింది మాత్రం మనుష్యత్వం.
  • తర్వాత ఆ ముగ్గురు తమ ఆయుధాలను సమర్పించి అధికారికంగా లొంగిపోయారు. కానీ ఈ సంఘటనలో ప్రధానంగా నిలిచింది వారి లొంగుబాటు కాదు — ఒక పోలీస్‌ అధికారి చూపించిన హృదయం.
  • అడవుల్లో శాంతి తేవడానికి బుల్లెట్లు మాత్రమే కాదు, భోజనం పంచుకునే చేతులు కూడా అవసరమని ఈ సంఘటన మరోసారి నిరూపించింది