స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: వర్ధన్నపేట మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. మూడేళ్ల పసికందుతో సహా ఓ తల్లి ఎస్సారెస్పీ కాలువలోకి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటన శనివారం మండల పరిధిలోని కట్రియాల గ్రామ శివారులో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్రియాల గ్రామానికి చెందిన కామిండ్ల కళ్యాణి (30) మూడేళ్ల కుమారుడు శ్రేష్యాన్స్ తో కలిసి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో దూకింది. కాలువలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు.వివరాల్లోకి వెళ్తే కళ్యాణికి నాలుగేళ్ల క్రితం జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలానికి చెందిన కామిండ్ల హరీష్‌తో వివాహం జరిగింది. హరీష్ ప్రస్తుతం మామునూరు బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.తల్లీకొడుకుల మృతితో కట్రియాల గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. అల్లారుముద్దుగా పెరగాల్సిన చిన్నారి, నిండు నూరేళ్లూ జీవించాల్సిన తల్లి ఇలా అర్ధాతరంగా తనువు చాలించడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా, కళ్యాణి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.