SPOT VOICE
Newspaper Banner
Date : 09 March 2026, 10:16 pm Posted By : SPOT VOICE MEDIA

గణపురంలో అర్ధరాత్రి మట్టి దందా

గణపురంలో అర్ధరాత్రి మట్టి దందా

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్

తప్పిన పెను ప్రమాదం.

చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు

స్పాట్ వాయిస్, ​గణపురం:మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువు సాక్షిగా అక్రమ మట్టి రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఆదివారం అర్ధరాత్రి మట్టి మాఫియా గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తుండగా తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ​అర్ధరాత్రి వేళ గణపసముద్రం చెరువు నుండి మట్టిని తరలిస్తున్న ఒక ట్రాక్టర్ అదుపు తప్పి ప్రధాన రహదారిపై ఉన్న 11 KV విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో విద్యుత్ స్తంభం విరిగి ప్రమాదకరంగా వంగిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది, లేనిపక్షంలో పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

​రాజకీయ అండదండలతోనే అక్రమాలు?

​కొందరు రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ అక్రమ మట్టి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తులో పడి పట్టించుకోవడం లేదని కాలనీ వాసి నాయకపు విశ్వ ప్రసాద్ ఆరోపించారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ అక్రమ రవాణా జరుగుతోంది. రాత్రివేళల్లో అతివేగంగా వెళ్లే ట్రాక్టర్ల వల్ల సామాన్య ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని‌ ఆయనతోపాటు కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ​అక్రమ మట్టి తరలింపును తక్షణమే చర్యలు చేపట్టకపోతే కాలనీ వాసులతో కలిసి ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. కాగా, ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులు స్పందిస్తూ, ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినందుకు ప్రమాదానికి కారణమైనందుకు మట్టి దందా నిర్వాహకులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.