- బెంబేలెత్తుతున్న జనం!
- వరుస దాడులతో ప్రజల్లో ఆందోళన
- పట్టించుకోని పంచాయతీ యంత్రాంగం
స్పాట్ వాయిస్, గణపురం: గణపురంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా వీధుల్లో చేరుతూ బాటసారులపై విరుచుకుపడుతున్నాయి. గడిచిన రెండు రోజుల్లో ఇద్దరిపై దాడులు జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.శనివారం చేరాలు అనే వ్యక్తిపై దాడి చేసిన కుక్కలు, ఆదివారం మరో వృద్ధుడిని లక్ష్యంగా చేసుకున్నాయి. మండల కేంద్రానికి చెందిన సర్దార్ అనే వృద్ధుడు పని నిమిత్తం బయటకు రాగా, కుక్కల గుంపు ఒక్కసారిగా ఆయనపై దాడికి తెగబడింది. ఈ క్రమంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమివేసి, బాధితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కుక్కల బెడద తీవ్రంగా ఉన్నా పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్న పిల్లలు, వృద్ధులు ఒంటరిగా బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి, కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు.
