- సమాజానికి బాధ్యత గుర్తుచేసిన సీఎం రేవంత్ రెడ్డి
- వృద్ధ తల్లిదండ్రులు అనాథలుగా మిగలకుండా చట్టం తీసుకొస్తున్నాం: సీఎం

స్పాట్ వాయిస్, వరంగల్ : తెలంగాణలో వృద్ధ తల్లిదండ్రుల భద్రత కోసం కీలకమైన చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనసభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రవేశపెట్టిన “తెలంగాణ ఎంప్లాయిస్ అకౌంటబిలిటీ, మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్లు-2026”పై సీఎం స్పందిస్తూ ఈ చట్టం వెనుక ఉన్న భావనను వివరించారు.

అందరికీ అన్ని రకాల చట్టాలు ఉన్నాయి..
వృద్ధాప్యంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యానికి గురికాకుండా వారికి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావించి ఈ బిల్లును తీసుకొచ్చామని తెలిపారు. తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరించే వారికి భయం కలిగించేలా ఈ చట్టం ఉండాలని ఆయన పేర్కొన్నారు. సమాజంలో పెరుగుతున్న స్వార్థపూరిత ధోరణులు, బంధాలు బలహీనపడుతున్న నేపథ్యంలో ఈ చట్టం అవసరం ఏర్పడిందన్నారు.
దేశంలో పిల్లలు, మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు అమల్లో ఉన్నాయని సీఎం గుర్తుచేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (ఏ) ద్వారా పిల్లలకు ఉచిత విద్య హక్కు కల్పించబడిందని, ఆర్టికల్ 24 ప్రకారం బాల కార్మికత్వం నిషేధమని తెలిపారు. అలాగే జువెనైల్ జస్టిస్ చట్టం, పోక్సో చట్టం, విద్యా హక్కు చట్టం వంటి ఎన్నో చట్టాలు పిల్లల రక్షణకు ఉన్నాయని చెప్పారు. మహిళల కోసం గృహ హింస నిరోధక చట్టం, నిర్భయ చట్టం, వరకట్న నిషేధ చట్టం వంటి అనేక నిబంధనలు ఉన్నాయని వివరించారు.
వృద్ధుల సంరక్షణకు ఇప్పటికే “మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్-2007” ఉన్నప్పటికీ, ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం పెరుగుతుండడం ఆందోళనకరమని సీఎం పేర్కొన్నారు. బతికున్నప్పుడు తల్లిదండ్రులను చూసుకోకుండా, వారు చనిపోయిన తర్వాత ఆస్తుల కోసం గొడవపడే పరిస్థితులు దురదృష్టకరమని అన్నారు.

ఈ చట్టం ద్వారా వారికి భరోసా…
పురాణాలలో తల్లిదండ్రుల పట్ల అత్యంత భక్తిని చూపిన శ్రవణ కుమారుడి కథను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ప్రతి ఒక్కరూ అలాంటి విలువలను ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ పత్ సింఘానియా జీవితంలో జరిగిన సంఘటనను ఉదాహరణగా చెబుతూ, ఆస్తి ఇచ్చిన తర్వాత తనకే ఆశ్రయం లేకుండా పోయిన పరిస్థితి సమాజానికి హెచ్చరికగా ఉందని తెలిపారు.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండటం వల్ల తల్లిదండ్రులకు సంరక్షణ లభించేదని, కానీ ఇప్పుడు చిన్న కుటుంబాల వల్ల ఆ బాధ్యత తగ్గిందన్నారు. కొందరు పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం బాధాకరమని, అలాంటి వారిని సమాజం ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ చట్టం ద్వారా అన్ని సమస్యలు వెంటనే పరిష్కారమవవని, కానీ వృద్ధ తల్లిదండ్రుల్లో భరోసా కలిగించడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకువచ్చామని తెలిపారు.
చివరగా, సమాజానికి మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ బిల్లుకు అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో విజ్ఞప్తి చేశారు.