ePaper
Thursday, March 19, 2026
ads
ePaper
Homeసినిమాలొంగిపోయిన సిద్ధార్థ్ రెడ్డి

లొంగిపోయిన సిద్ధార్థ్ రెడ్డి

📰 Generate e-Paper Clip

 

నటి ప్రత్యూష మృతి కేసు 24 ఏళ్ల తర్వాత కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన ప్రముఖ సినీ నటి ప్రత్యూష మృతి కేసులో 24 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సిద్ధార్థ్ రెడ్డి.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాజాగా అమెరికా నుంచి వచ్చి హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అనంతరం పోలీసులు అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

న్యాయస్థానాల తీర్పుల నేపథ్యం

ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న అభియోగాలపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు గతంలో సిద్ధార్థ్ రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై అతను హైకోర్టును ఆశ్రయించగా, ఆ శిక్షను రెండేళ్లకు తగ్గించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సిద్ధార్థ్ సుప్రీంకోర్టుకు వెళ్లగా, అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ అతని పిటిషన్‌ను కొట్టివేసింది. నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించడంతో, అతనికి తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు ముందు హాజరుకావాల్సి వచ్చింది.

అసలేం జరిగిందంటే..

* ప్రేమ ప్రయాణం: ఎస్‌ఆర్‌నగర్‌లో ఇంటర్ చదువుతున్న రోజుల నుంచే ప్రత్యూష, సిద్ధార్థ్ రెడ్డి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ప్రత్యూష సినిమాల్లోకి రాగా, సిద్ధార్థ్ ఇంజనీరింగ్ చేశాడు.
* పెద్దల వ్యతిరేకత: వీరి పెళ్ళికి ప్రత్యూష తల్లి అంగీకరించినా, సిద్ధార్థ్ తల్లి మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
* విషాదాంతం: తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరూ 2002 ఫిబ్రవరి 23న కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగారు.
* బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24న ప్రత్యూష కన్నుమూయగా, సిద్ధార్థ్ కోలుకుని మార్చి 9న డిశ్చార్జి అయ్యాడు.
అయితే, తన కూతురిది ఆత్మహత్య కాదని ప్రత్యూష తల్లి చేసిన న్యాయపోరాటం అప్పటినుంచి కొనసాగుతూనే ఉంది. తాజాగా సిద్ధార్థ్ లొంగిపోవడంతో రెండు దశాబ్దాల క్రితం నాటి ఈ సంచలన కేసు మళ్లీ చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular