SPOT VOICE
Newspaper Banner
Date : 23 February 2026, 10:28 pm Posted By : SPOT VOICE MEDIA

కేయూలో విద్యార్థుల కొట్లాట

చికెన్ విషయంలో రెండు డిపార్ట్మెంట్ విద్యార్థుల మధ్య వివాదం
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: కాకతీయ యూనివర్సిటీలో కోడికూర విషయంలో తలెత్తిన గొడవ తలలు పగిలే వరకు వెళ్లింది. ఎకానమిక్స్, ఎంబీఏ విద్యార్థుల మధ్య ఘర్షణ చిలికిచిలికి గాలివానగా మారి యూనివర్సిటీలో ప్రశాంతతను చెదరగొట్టింది. ఎకనామిక్స్ విద్యార్థులకు ఏబీవీపీ లీడర్లు తోడవంతో ఎంబీఏ విద్యార్థుల తలలు పగిలాయి. ఈ ఘటనలో ఇరువర్గాలపై కేసు నమోదైంది. దీంతో కేయూలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఆదివారం యూనివర్సిటీ హాస్టల్స్ లో మెస్ కమిటీ ఎకనామిక్స్, కామర్స్ డిపార్ట్ మెంట్ల విద్యార్థుల ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ క్రమంలోనే నిన్నటి ఆదివారం మధ్యాహ్నం లంచ్ చికెన్ తో భోజనాలు అయ్యాక కొంత చికెన్ మిగిలింది. మిగిలిన చికెన్ ను తమకు కావాలంటే తమకు కావాలంటే ఎకనామిక్స్, ఎంబీఏ విద్యార్థులు గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే ఎకనామిక్స్ విద్యార్థులను ఎంబీఏ విద్యార్థులు బెదిరింపులకు దిగడంతో వారు వెళ్లి కేయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు ఏబీవీపీ లీడర్లకు సమాచారమివ్వడంతో వారు క్యాంపస్ కు చేరుకుని ఎకనామిక్స్ విద్యార్థులతో కలిసి ముగ్గురు ఎంబీఏ విద్యార్థులపై కర్రలతో విచక్షణరహితంగా దాడి చేశారు. దీంతో ముగ్గురు విద్యార్థుల తలలు పగిలాయి. ఆ సమయంలో పోలీసులు కూడా సంఘటన స్థలంలోనే ఉండడం, గొడవను ఆపేందుకు ప్రయత్నించకపోవడం వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. గాయపడిన విద్యార్థులను వెంటనే ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. సోమవారం క్యాంపస్ కు ఏసీపీ, కేయూ సీఐ, ఎస్సైలు చేరుకుని గొడవలు జరగకుండ పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.